పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న మీరే ఇలా చేస్తే ఎలా..?: మాణిక్‌రావ్ ఠాక్రేకు మహేశ్వర్ రెడ్డి లేఖ..
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేకు ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లేఖ రాయడం పార్టీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేకు ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లేఖ రాయడం పార్టీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కొద్ది రోజులు పాదయాత్ర కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే తనను 4 రోజులు పాదయాత్ర చేశాక ఆపేయమన్నారని మహేశ్వర్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. అది తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని పేర్కొన్నారు. తాను పార్టీకి కట్టుబడి పనిచేసే వ్యక్తినని.. పార్టీ కోసమే పాదయాత్ర చేశానని లేఖలో తెలిపారు. తాను పార్టీకి నష్టం చేకూర్చే పని ఎప్పుడూ చేయలేదని చెప్పారు. కొందరిలా సొంత ఎజెండాతో పాదయాత్ర చేయలేదని అన్నారు.
తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న మీరే తనను అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. మీరు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. లోపాలు సరిదిద్దాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఆత్మాభిమానం చంపుకుని పనిచేయలేనని స్పష్టం చేశారు. మీ నుంచి సమాధానం వస్తుందని ఎదురుచూస్తున్నానని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ‘‘హోత్ సే హాత్ జోడో అభియాన్’’లో మహేశ్వర్ రెడ్డి.. మార్చి 3వ తేదీన నిర్మల్ జిల్లా నుంచి తెలంగాణ కాంగ్రెస్ పోరు యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. విడతల వారీగా యాత్రను కొనసాగిస్తూ.. హైదరాబాద్‌కు చేరుకోనున్నట్టుగా మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం అనుమతితోనే ఈ యాత్రకు సిద్దమయ్యామని.. కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర పేరుతో యాత్ర చేపట్టిన అది హోత్ సే హాత్ జోడో అభియాన్‌లో భాగమేనని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ ఈ యాత్రలో పాల్గొంటారని చెప్పారు.
మహేశ్వర్ రెడ్డి చెప్పినట్టుగానే.. ఆయన యాత్రలో మాణిక్‌రావ్ ఠాక్రేతో సహా ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్, వీహెచ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా.. తదితర సీనియర్ నేతలు పాలుపంచుకన్నారు. అయితే పాదయాత్ర మొదలుపెట్టిన నాలుగు రోజులకే నిలిచిపోయింది. ఈ క్రమంలోనే మాణిక్ రావ్ ఠాక్రే వైఖరిని ప్రశ్నిస్తూ.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి లేఖ రాయడం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.