కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏలేటి  మహేశ్వర్‌ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాసమక్షంలో మహేశ్వర్ రెడ్డి  ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాసమక్షంలో మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ చీఫ్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇక, తెలంగాణలో ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న మహేశ్వర్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. 

తాను ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. తాను పార్టీలో ఇమడలేనని అర్థమైందని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం మహేశ్వర్ రెడ్డి ఢిల్లీలో ఈటల రాజేందర్, బండి సంజయ్‌లతో కలిసి తరుణ్ చుగ్ నివాసానికి వెళ్లారు. తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు తరుణ్ చుగ్‌తో భేటీ అనంతరం మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బీజేపీ నేతలను మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా చెప్పారు. జేపీ నడ్డాను కలిసిన తర్వాత అన్ని వివరాలు చెబుతానని అన్నారు. ఏప్రిల్ 26 తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తీవ్ర మనస్తాపంతో కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డిల మధ్య సత్సబంధాలు లేవనే ప్రచారం ఉంది. అయితే మహేశ్వర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. గంటలోగా వివరణ ఇవ్వాలని టీపీసీసీ ఆయనకు బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. మహేశ్వర్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ప్యానెల్‌కు ఫిర్యాదులు అందాయని టీపీసీసీ క్రమశిక్షణా చర్య కమిటీ చైర్మన్‌ చిన్నారెడ్డి తెలిపారు.

అయితే తనకు షోకాజ్ నోటిసులు ఇవ్వడంపై స్పందించిన మహేశ్వర్ రెడ్డి.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలోని కొందరు వ్యక్తులు తనను బలవంతంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతల అమిత్ షాను కలిసినవారికి షోకాజ్ ఇచ్చే దైర్యం లేదు.. కానీ నాకు ఎందుకు ఇచ్చారో అర్దం కావడం లేదని అన్నారు. తాను పార్టీ గీత దాటలేదని చెప్పారు. అంతర్గత సమావేశాల్లో మాత్రమే తాను మాట్లాడినట్టుగా తెలిపారు. తాను ఖర్గే వద్దే తేల్చుకుంటానని కూడా అన్నారు. టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. పలు పార్టీల నుంచి ఫిరాయించిన, విశ్వసనీయత లేని వ్యక్తి తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లిన మహేశ్వర్ రెడ్డి.. అనుహ్యంగా అక్కడే కాంగ్రెస్‌కు రాజీనామాను ప్రకటించారు.