Asianet News TeluguAsianet News Telugu

బెల్లంపల్లి ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ట్యాబ్లెట్లు కావాలా? అమ్మాయిల కోసం కోడ్ భాషలో ఛాటింగ్ ..

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. అమ్మాయిల్ని పంపమంటూ ఒత్తిడి తెస్తున్నాడని ఓ మహిళ ఆరోపించారు. 

Allegations of sexual harassment against Bellampally MLA Durgam Chinnaiah, telangana - bsb
Author
First Published Mar 28, 2023, 11:54 AM IST

మంచిర్యాల : అధికార పార్టీ ఎమ్మెల్యేపై  లైంగిక ఆరోపణలు మంచిర్యాల జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఈ ఆరోపణలు  చేశారు ఓ సంస్థకు చెందిన సీఈవో. ఆరిజన్ డైయిరీ  సంస్థ సీఈవో అయిన బోడపాటి శైలజ అలియాస్ షెజల ఈ మేరకు దుర్గం చిన్నయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రైవేట్ డైరీ సంస్థ విస్తరణకు సహాయం చేస్తానని చెప్పి యాజమాన్యాన్ని వేధించారని ఆమె చెప్పుకొచ్చారు..  అంతేకాదు.. తమ దగ్గర ఉద్యోగి అయిన ఓ అమ్మాయిని పంపాలని ఇబ్బంది పెట్టారని ఆరోపణలు చేశారు. డెయిరీ సంస్థ ఏర్పాటు కోసం బెల్లంపల్లిలో స్థలం ఇచ్చి సహకరిస్తానని తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని తెలిపారు. 

సంస్థ విస్తరణ కోసం ఎమ్మెల్యే చెప్పినట్లుగా విన్నామని.. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయనకు ఎన్నో సఫర్లు చేశానని శైలజ చెప్పుకొచ్చారు. అయితే, ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లుగా ప్లాంట్ ఏర్పాటు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించకపోగా.. తమపైనే ఆయన తప్పుడు కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోడపాటి శైలజ వాయిస్ గా చెబుతున్న ఆడియో రికార్డు ఈ మేరకు ఒకటి వైరల్ గా మారింది. ఆ వాయిస్ లో ఆమె ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది.  ఆయన నుంచి తనను కాపాడాలని కోరింది. 

ఆ ఆడియో రికార్డులో ఆమె ఏం చెప్పిందంటే…‘ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నారు. మమ్మల్ని నమ్మించి, మా దగ్గర డబ్బులు తీసుకుని.. మాపైనే తప్పుడు కేసులు పెట్టించారు. బ్రాంచి ఓపెనింగ్ సమయంలో మొదటిసారి మేము ఎమ్మెల్యేను కలిశాం. మా వాళ్లకు మీ కంపెనీలో షేర్ ఇయ్యండి. మీకు పూర్తిగా సహకరిస్తాను, సపోర్టు చేస్తానని ఆయన తెలిపారు. దానికి మేము సరే అన్నాము. మేము అంగీకరించిన తర్వాత రెండెకరాల స్థలాన్ని ఆయన మాకు ఆఫర్ చేశారు. దీని కోసం రూ. 20 లక్షలు  అడ్వాన్స్ గా కూడా చెల్లించాం.  

మార్గదర్శి చిట్ ఫండ్ కేసు.. ఎండీ శైలజాకిరణ్ కు ఏపీ సీఐడీ నోటీసులు..

అయితే అతను చెప్పిన స్థలం ప్రభుత్వస్థలం. అది మేం ప్రశ్నించాక త్వరలోనే రిజిస్ట్రేషన్ చేపిస్తానని ఆయన తెలిపారు. దీంతో అతని మాటలు నమ్మి.. అదే స్థలంలో  ప్లాంట్ ఏర్పాటు కోసం భూమి పూజ కూడా చేసి.. ప్లాంట్ కన్స్ట్రక్షన్ బాధ్యతలను సాన శ్రవణ్, థామస్ అనే వ్యక్తులకు అప్పగించారు. ఈ క్రమంలోనే హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బిజినెస్ మీటింగ్ కోసం ఎమ్మెల్యే చిన్నయ్యను తరచుగా కలిసే వాళ్ళం. అలా ఒకరోజు మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు నాతోపాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ కు మరో అమ్మాయి కూడా వచ్చింది. ఆమె మీద ఎమ్మెల్యే కన్నేశారు.

ఆ తర్వాత ఒకరోజు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాల్ చేసి.. నాతోపాటు ఆరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిన అమ్మాయిని  రాత్రికి పంపిస్తారా? అని అడిగాడు. కానీ నేను ఆ అమ్మాయి అలాంటిది కాదని  చెప్పాను.  అక్కడితో ఆయన దాన్ని వదిలేయకుండా ఏ అమ్మాయి అయినా సరే పంపించాలని మా మీద ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఏమీ చేయలేక తెలిసిన వారి ద్వారా ఓ బ్రోకర్ నెంబర్ ఆయనకు ఇచ్చి.. యువతులు పంపేలా ఏర్పాట్లు కూడా చేసాం. ఇంకోసారి ఎమ్మెల్యే క్వార్టర్స్ కు పిలిచి దళిత బంధు విషయమై మాట్లాడాలని అన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత నాకు మందు ఆఫర్ చేశారు. కానీ నాకు తాగే అలవాటు లేదని చెప్పి వచ్చేసాం.

ఆ తర్వాత మళ్లీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యనే ఫోన్ చేశారు.  దళిత బంధు గురించి మాట్లాడాలని బెల్లంపల్లిలోని ఇంటికి రావాలని తెలిపారు. అప్పటికే మమ్మల్ని అనేక రకాలుగా వాడుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళాం. కాసేపటికే పోలీసులు వచ్చారు. మూడు రోజులపాటు మమ్మల్ని అక్రమంగా  పోలీస్స్టేషన్లో బంధించి టార్చర్ చూపించారు. మా మీద తప్పుడు కేసులు బనాయించారు. మూడు రోజుల టార్చర్ తర్వాత నాలుగో రోజు  రిమాండ్ మీద  అదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. 

అలా జైలుకు వెళ్లిన మేము 20 రోజుల తర్వాత కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చాం. ఇప్పుడు బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రతి శని, ఆదివారాలు మేము హాజరవ్వాల్సి ఉంది. అలా హాజరవుతున్న క్రమంలో ఎమ్మెల్యే మనుషులు లక్సెట్టిపేట దగ్గర నుంచి వెంబడించడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని మేము పోలీస్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత ఎస్ఐకి ఫిర్యాదు చేశాం. వారి మీద కేసు నమోదు చేయాలని కోరాం. వ్యక్తిగతంగా వచ్చి చెప్పాలని తెలిపారు. కానీ, అలా రావాలంటే మాకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా వినిపించుకోలేదు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. ఆయన అనుచరులతో నాకు ప్రాణహాని ఉంది.. మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నాము’ అని ఆడియో క్లిప్ ని  శైలజ ముగించారు.

మరోవైపు..  దుర్గం చిన్నయ్య కోరిక మేరకు శైలజ ఏర్పాటు చేయించినట్లుగా చెబుతున్న బ్రోకర్ కు..  ఎమ్మెల్యేకు  మధ్య వాట్సాప్ సంభాషణ  జరిగింది. దీని తాలూకు స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంభాషణ అంతా కోడ్ భాషలో సాగింది. అమ్మాయిలను టాబ్లెట్లుగా వ్యవహరిస్తూ..  టాబ్లెట్లు కావాలా..అంటూ..  ఆ వాట్సప్ చాట్ జరిగింది. దీంతోపాటు హైదరాబాదులో చేసిన ఎంజాయ్  గురించిన మెసేజ్లు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే తనమీద వచ్చిన ఈ ఆరోపణలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కొట్టిపారేశారు. ఆదినారాయణ, షెజలలు డైరీ పేరుతో రైతులను మోసగించాలని ప్రయత్నించారు. దీనికి నేను అడ్డుపడ్డాను. దీంతో నా పేరును చెడగొట్టేందుకే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ నాకు తెలిసే.. నేను వాళ్ళను పోలీసులకు పట్టించాను అని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios