Asianet News TeluguAsianet News Telugu

రేపే మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్.. విస్తృత ఏర్పాట్లు చేసిన ఈసీ.. మధ్యాహ్నం లోపే తుది ఫలితం..!

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపును ఆదివారం (నవంబర్ 6) చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

All set for counting of votes tomorrow for Munugode bypoll
Author
First Published Nov 5, 2022, 4:16 PM IST

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపును ఆదివారం (నవంబర్ 6) చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్​లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 7గంటలకు  పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయనున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 

ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. 21 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లను ఒక్కో రౌండ్‌లో లెక్కించనున్నారు. ఇక, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తెరవడానికి ముందు అధికారులు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత.. ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 

జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణా రెడ్డి, ఆర్​ఓ రోహిత్ సింగ్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది.  ఒక్కో టేబుల్​కు కౌంటింగ్ సూపర్​వైజర్​,అసిస్టెంట్ సూపర్​వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఉపఎన్నిక పోరులో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున కౌంటింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్ ఏజెంట్లందరికీ బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ మొత్తం ప్రక్రియ వీడియో గ్రాఫ్ చేయబడుతుంది.

ఉదయం 9 గంటల కల్లా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. తుది ఫలితం మధ్యాహ్నాం ఒంటిగంట కల్లా వచ్చే అవకాశముంది. తొలుత చౌటుప్పల్ మండల ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్​ మండలాల ఓట్లను లెక్కిస్తారు.

ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉపఎన్నిక  పోలింగ్ జరగగా.. సాయంత్రం వేళ ఓటర్లు భారీగా పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటలలోపు క్యూలైన్లలో వారందరీకి అధికారులు ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే కొన్ని పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ప్రక్రియ రాత్రి 10.30 గంటల వరకు కొనసాగింది. దీంతో  అర్ధరాత్రి  1.30 గంటలకు నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్​కు చేరింది. తెల్లవారుజామున 4.40 గంటలకు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్​రూమ్​ను సీజ్​ చేశారు.

మునుగోడు ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ అదికారులు తెలిపారు. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో 91.31 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 91.31 శాతం పోలింగ్ నమోదైంది.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..  ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీ అభ్యర్థిగా మునుగోడు ఉపఎన్నికలో బరిలో నిలిచారు. 2018లో రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి రెడ్డిని పోటీలో దింపింది. మొత్తంగా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలిచారు. 

మునుగోడులో విజయంపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి సీపీఐ, సీపీఎం రెండూ టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికాయి. దీంతో తమకు టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అకాశం ఉందనేటాక్ వినిపిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా ఖర్చు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మునుగోడు పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన చాలా ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి.  

ఇక, మునుగోడులో 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. 2018లో కాంగ్రెస్ టికెట్‌పై బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 23,552 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios