సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలకు పురస్కరించుకొని పోలింగ్ కు  ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 3వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఎన్నికల నిర్వహణకు కోసం ఐదు వేల మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు ఇప్పటికే చేరుకొన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు 315 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో 1,98,807 మంది ఓటర్లున్నారు. వీరిలో 97,978 మంది పురుషులు, 1,00,778 మంది మహిళా ఓటర్లున్నారు. 51 మంది సర్వీస్ ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో 89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు.  నియోజకవర్గంలో 315 ఈవీలతో పాటు స్పేర్ లో 120 ఈవీఎంలను ఏర్పాటు చేశారు.

కరోనా సమయంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఏఎన్ఎం, ఆశా వర్కర్ ను నియమించారు. ప్రతి ఓటర్ కు గ్లౌజ్ లను ఇవ్వనున్నారు. మాస్కు లేకపోతే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతివ్వరు.

also read:ఆత్మహత్యాయత్నానికి.. దుబ్బాకకు సంబంధం లేదు: రఘనందన్

ఓటు వేసేందుకు వచ్చిన ఓటరుకు టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఈ నియోజకవర్గంలో  టీఆర్ఎస్ తరపున సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.

మూడు పార్టీల తరపున కీలక నేతలు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. టీఆర్ఎస్ తరపున  మంత్రి హరీష్ రావు ప్రచార బాధ్యతను తన భుజాలపై వేసుకొన్నారు.