దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి సంబంధం లేదన్నారు దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నైతికంగా ఓడిపోయి ఏం మాట్లాడాలో తెలియక ఆగస్టు 17 నుంచి ఈరోజు దాకా దుబ్బాకను వదిలిపెట్టకుండా ప్రజల మన్ననలను పొందామనే అక్కసుతోనే గత నాలుగు రోజులుగా టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందన్నారు.

శామీర్‌పేటలో తొలి అంకం మొదలైందని రఘునందన్ ఆరోపించారు. ఆ రోజు రెండు కార్లలో నలుగురు వ్యక్తులు, రూ.40 లక్షలు తీసుకెళ్తున్నారని పోలీసులు చెప్పారని ఆయన వెల్లడించారు.

శామీర్‌పేట పోలీసులు చెప్పిన నలుగురిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నది నగ్నసత్యమన్నారు. వీరంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గజ మాలలు వేస్తూ వారితో కలిసి ఫోటోలు దిగారని రఘునందన్ రావు చెప్పారు.

ఈ ఫోటోలను టీఆర్ఎస్ అధికారిక వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేశామని ఆయన తెలిపారు. రఘునందన్ రావు పటాన్ చెరువులో వున్నాడు కాబట్టి.. ఆ డబ్బు, ఆ మనుషులు తనవాళ్లేనని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

తన కారుని పదుల సార్లు ఆపి, టైర్లు, సీట్లు పీకినా తాను ఇబ్బంది పడలేదని రఘునందన్ రావు గుర్తుచేశారు. సిద్ధిపేటలో తన మామయ్య సురభి రాం గోపాల్ రావు కుటుంబం ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది.

దసరా పండుగ నాడు తన కుటుంబం సిద్ధిపేటకు వస్తే... ఆ రోజు కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడిన భాస్కర్ రెడ్డి అనే నేతను పరామర్శించేందుకు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి వెళ్లానని రఘునందన్ రావు వెల్లడించారు.

ఎప్పటికో ఇంటికి చేరి.. భార్యాబిడ్డలతో కలిసి భోజనం చేశానని ఆయన తెలిపారు. ఆ తర్వాతి రోజు మళ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లానని రఘునందన్ చెప్పారు. తాను బయటకు వెళ్లిన గంట తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారని ఆయన వెల్లడించారు.

తాను అత్తగారింటికి వెళ్లి భోజనం చేసినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రఘునందన్ మండిపడ్డారు. మూడు గంటల పాటు సోదాలు నిర్వహించారని.. కనీసం సెర్చ్ నోటీసు కూడా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.

ఇంట్లో వాళ్లు ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోయే సరికి ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి సిద్ధిపేట వచ్చానని రఘునందన్ తెలిపారు. తాము ముందుగానే ప్లాన్ వేసుకున్నామని ప్రచారం మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు.