అజరుద్దీన్‌కు మజ్లిస్ షాక్.. జూబ్లిహిల్స్ బరిలో ఎంఐఎం అభ్యర్థి
అజరుద్దీన్‌కు ఎంఐఎం పార్టీ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ టికెట్ పై అజరుద్దీన్ పోటీ చేస్తున్న జూబ్లిహిల్స్ స్థానంలో మజ్లిస్ కూడా పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం వెల్లడించారు. దీంతో మైనార్టీల ఓట్లలో చీలిక తప్పదని తేలిపోతున్నది. జూబ్లిహిల్స్‌లో మైనార్టీలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. 2014లో కాంగ్రెస్ ఓటమికి మజ్లిస్ పార్టీనే కారణం అనే వాదన కూడా ఉన్నది.
హైదరాబాద్: కాంగ్రెస్ రెండో జాబితాలో జూబ్లిహిల్స్ స్థానంలో అభ్యర్థిగా మాజీ క్రికెట్ ప్లేయర్, మాజీ ఎంపీ అజరుద్దీన్‌ను బరిలోకి దించుతున్నట్టు ప్రకటించింది. ఈ సీటు కోసం దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నించారు. దాదాపు తనకే జూబ్లిహిల్స్ టికెట్ వస్తుందనీ ఆశ పడ్డారు. కానీ, విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ మొండిచేయే చూపించింది. అనూహ్యంగా జూబ్లిహిల్స్ నుంచి అజరుద్దీన్‌కు టికెట్ కన్ఫామ్ చేసింది.
జూబ్లిహిల్స్‌లో మైనార్టీల ఓట్లు అధికంగా ఉంటాయి. ఈ ఓట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అజరుద్దీన్‌ను బరిలోకి దించే నిర్ణయం తీసుకుని ఉంటుంది. కానీ, మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి, అజరుద్దీన్‌కు షాక్ ఇచ్చింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ రోజు కీలక ప్రకటన చేశారు. జూబ్లిహిల్స్, రాజేంద్రనగర్ నుంచి కూడా తాము బరిలో నిలుస్తామని వెల్లడించారు. అభ్యర్థిని ప్రకటించకున్నా.. జూబ్లిహిల్స్‌లో మాత్రం పోటీ చేస్తామని చెప్పారు.
Also Read: సీబీఐ అధికారిగా నమ్మించి ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 20 లక్షలు డిమాండ్.. చివరికి
సాధారణంగా మజ్లిస్ పార్టీ పాత బస్తీలోని ఏడు సీట్లలో పోటీ చేస్తుంది. కానీ, ఈ సారి మరో రెండు సీట్లలో పోటీని ప్రకటించింది. అయితే.. గతంలోనూ జూబ్లిహిల్స్‌లో ఎంఐఎం పోటీ చేసింది. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేసి సుమారు 40 వేలకు పైగా ఓట్లు పొందారు. అప్పుడు కాంగ్రెస్ ఓటమికి ఎంఐఎం ప్రధాన పాత్ర పోషించిందని, ఓట్లను చీల్చిందనే వాదనలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఎంఐఎం అదే పని చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది.