తెలంగాణలో కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలో బిల్లును త్వరగా క్లియర్ చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. 

కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును ఆమోదించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. బిల్లు క్లియర్ కాక వర్సిటీల్లో ఖాళీల భర్తీ నిలిచిపోయింది. 5 నెలలుగా కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు పెండింగ్‌లో వుంది. వెంటనే బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరారు అక్బరుద్దీన్. 

ఇక, రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్‌ యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లును తెలంగాణ సర్కార్ తీసుకొచ్చింది. బోర్డుకు ఒక చైర్‌పర్సన్‌, నలుగురు సభ్యులు ఉంటారని తెలిపింది. పదవిరీత్యా ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు సైతం చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహత్మాగాంధీ, తెలంగాణ, తెలంగాణ మహిళా వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్‌, ఆర్జీయూకేటీ, జేఎన్టీయూ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ యూనివర్సిటీలు బోర్డు పరిధిలో చేర్చింది. 

అయితే తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులు కూడా గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును పెండింగ్‌లో ఉంచడం ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేశారని తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. అటు అధికార బీఆర్ఎస్ నేతలు సైతం దీనిపై భగ్గుమంటున్నారు. గవర్నర్ తీరు సరికాదని తక్షణం బిల్లును ఆమోదించాలని కోరుతున్నారు.

ALso REad: తమిళిసైతో ముగిసిన సబితా ఇంద్రారెడ్డి భేటీ.. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

ఈ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గతేడాది నవంబర్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశమై వివరణ ఇచ్చారు. ఆమెకున్న సందేహాలను సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేశారు. యూజీసీ నిబంధనలు, న్యాయపరమైన రిజర్వేషన్ల అంశాలను తమిళిసై ప్రస్తావించారు. నిబంధలను పాటిస్తున్నామని.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.

ప్రభుత్వ వాదనలకు గవర్నర్ తమిళిసై సైతం కౌంటరిచ్చారు. బిల్లుల్ని సమగ్రంగా పరిశీలించేందుకు సమయం తీసుకున్నానని అన్నారు. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా అర్ధం చేసుకున్నారని తమిళిసై వ్యాఖ్యానించారు. ఒక్కొక్క బిల్లుని కూలంకషంగా పరిశీలిస్తున్నానని.. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని గవర్నర్ స్పష్టం చేశారు. 

ALso REad: నేనేం బిల్లుల్ని ఆపలేదు.. పరిశీలించాలిగా, ఆలస్యం అందుకే : తమిళిసై

యూనివర్సిటీల్లో నియామకాల బిల్లును తాను ఆపుతున్నట్లు ప్రచారం చేశారని.. ఒక బోర్డు ఉండగా కొత్త బోర్డు ఎందుకని ఆలోచించానని తమిళిసై తెలిపారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని తానే డిమాండ్ చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. దానికి తానేదో బిల్లుల్ని ఆపానని ప్రచారం చేశారని తమిళిసై ధ్వజమెత్తారు. ఇప్పటికే అన్ని యూనివర్సిటీ వీసీలతో మాట్లాడానని.. సమగ్ర నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి పంపించానని గవర్నర్ వెల్లడించారు. కొత్తగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎందుకు.. అన్నదే తన ప్రశ్న అని ఆమె స్పష్టం చేశారు.