బిల్లులను క్లియర్ చేయకుండా జాప్యం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. బిల్లుల్ని సమగ్రంగా పరిశీలించేందుకు సమయం తీసుకున్నానని అన్నారు

తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదముద్ర వేయడంలో జాప్యంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివరణ ఇచ్చారు. బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుల్ని సమగ్రంగా పరిశీలించేందుకు సమయం తీసుకున్నానని అన్నారు. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా అర్ధం చేసుకున్నారని తమిళిసై వ్యాఖ్యానించారు. ఒక్కొక్క బిల్లుని కూలంకషంగా పరిశీలిస్తున్నానని.. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని గవర్నర్ స్పష్టం చేశారు. 

యూనివర్సిటీల్లో నియామకాల బిల్లును తాను ఆపుతున్నట్లు ప్రచారం చేశారని.. ఒక బోర్డు ఉండగా కొత్త బోర్డు ఎందుకని ఆలోచించానని తమిళిసై తెలిపారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని తానే డిమాండ్ చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. దానికి తానేదో బిల్లుల్ని ఆపానని ప్రచారం చేశారని తమిళిసై ధ్వజమెత్తారు. ఇప్పటికే అన్ని యూనివర్సిటీ వీసీలతో మాట్లాడానని.. సమగ్ర నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి పంపించానని గవర్నర్ వెల్లడించారు. కొత్తగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎందుకు.. అన్నదే తన ప్రశ్న అని ఆమె స్పష్టం చేశారు. 

ఎనిమిదేళ్లుగా వీసీ పోస్టులు ఖాళీగా వున్నాయని.. తన టూర్ ప్లాన్‌కు సంబంధించి అన్ని వివరాలు ప్రభుత్వానికి పంపానని గవర్నర్ వెల్లడించారు. తాను వెళ్లినప్పుడు కలెక్టర్ ,ఎస్పీ రాలేదని ఆమె తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడదని తమిళిసై ప్రశ్నించారు. రాజ్‌భవన్ .. ప్రగతి భవన్‌లా కాదని ఆమె స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌కు ఎవరైనా రావొచ్చు.. సమస్యలు చెప్పుకోవచ్చునని గవర్నర్ తెలిపారు.