తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్ వైపు ఎంఐఎం చూస్తున్నదా? తాజాగా బీఆర్ఎస్, ఎంఐఎం నేతల మధ్య మాటల యుద్ధం ఈ సంకేతాలను ఇస్తున్నదని చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలను అమలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగా దిగడమా? వేరే పార్టీలతో జట్టు కట్టడమా? అనేది ఆలోచనలు చేస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీలూ తమ ఎత్తుగడులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్‌కు ఎంఐఎం షాక్ ఇచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నేరుగా వార్నింగ్‌లు ఇచ్చుకున్నారు. మరో వైపు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. పాతబస్తీ అభివృద్ధిపై ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిందని, ఇతర మౌలిక వసతులు కల్పించకపోవడంపై ప్రశ్నించారు. ఇదిలా ఉండగా నిజామాబాద్‌లో అసదుద్దీన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
తాము తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఒవైసీ వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చను లేపాయి. దళిత బంధు తరహా ముస్లింలకూ ముస్లిం బంధూ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
Also Read: EMI: లోన్ ఈఎంఐ కట్టలేదని ఆ కస్టమర్ కూతురిని కిడ్నాప్ చేసిన సిబ్బంది
ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చని, తన ఎంపీ స్థానాన్ని పేర్కొంటూ హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ప్రజాదారణతో తామే మళ్లీ గెలుస్తామని ఒవైసీ అన్నారు. అయితే, పొత్తుపై తమ నిర్ణయాలను ఎన్నికల సమయం సమీపించిన తర్వాత వెల్లడిస్తామని వివరించారు. దీంతో రాజకీయ విశ్లేషకులు ఎంఐఎం తీరుపై చర్చ ప్రారంభించారు. తెలంగాణలో తమ పాత మిత్రపార్టీ కాంగ్రెస్ పుంజుకోవడంతో ఎంఐఎం అటు వైపు చూస్తున్నదని అభిప్రాయపడుతున్నారు. మరి బీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకుంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
