రేవంత్ మూలాలు ఆర్ఎస్ఎస్లోనే.. ఆయన సినిమా మొత్తం మా దగ్గరుంది : అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ . రేవంత్ రెడ్డి జీవితమంతా బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌తోనే ముడిపడి వుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలు ఆరెస్సెస్ నాలుక నుంచి వచ్చినవని అసదుద్దీన్ దుయ్యబట్టారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి జీవితమంతా బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌తోనే ముడిపడి వుందన్నారు. దశాబ్థాల పాటు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితోనే కలిసి తిరిగారని ఒవైసీ ఆరోపించారు. ఒవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందని రేవంత్ అంటున్నారని.. కానీ తన తాత ముత్తాతలు హిందుస్తాన్‌లోనే పుట్టారని స్పష్టం చేశారు. నా పూర్వీకులు ఇక్కడ పుడితే నా దేశం ఇదే అనే హక్కు తనకు లేదా అని ఒవైసీ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అసలు ఎక్కడి నుంచి వచ్చారని ఆయన నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలు ఆరెస్సెస్ నాలుక నుంచి వచ్చినవని అసదుద్దీన్ దుయ్యబట్టారు.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పనిచేయడాన్ని తాను చూశానని ఒవైసీ ఆరోపించారు. గుడిమల్కాపూర్ మార్కెట్ వద్ద రేవంత్, అసదుద్దీన్ కలిసి పనిచేశారని ఆయన తెలిపారు. రేవంత్ సినిమా మొత్తం మా దగ్గర వుందని.. ఆయన ముందు ఏబీవీపీలో అటు నుంచి ఆరెస్సెస్ అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్లావని ఒవైసీ ఆరోపించారు. ఆరెస్సెస్ వాళ్లు చంద్రుడి దగ్గరికి (చంద్రబాబు) వద్దకు వెళ్లమంటే అక్కడికి వెళ్లవని.. ఆయన పని అయిపోగానే కాంగ్రెస్‌లోకి వెళ్లావని ఒవైసీ దుయ్యబట్టారు.
ఆరెస్సెస్‌తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేస్తావా అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎక్కడ పుట్టారో చెప్పాలని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. హిందూ, సిక్కు, క్రైస్తవులకు తాము వ్యతిరేకం కాదని.. అన్ని మతాల వారికి దారుసల్లాం దర్వాజాలు తెరిచే వుంటాయని ఒవైసీ స్పష్టం చేశారు.