నేను కనుసైగ చేస్తే..: సీఐకి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వార్నింగ్..!!
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రసంగిస్తున్న చోటు నుంచి వెళ్లిపోవాలని పోలీసు అధికారిని హెచ్చరించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రసంగిస్తున్న చోటు నుంచి వెళ్లిపోవాలని పోలీసు అధికారిని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న అక్బరుద్దీన్ గత రాత్రి చాంద్రాయణగుట్టలో ప్రచారం చేశారు. సమయం మించిపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న సంతోష్‌నగర్ సీఐ శివచంద్ర ఆయనకు సమయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ ప్రకారం సమయం అయిపోయిందని.. ప్రచారాన్ని ముగించాలని కోరారు.
అయితే సీఐ శివచంద్ర ఆ మాట అనగానే అక్బరుద్దీన్ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రచారం ముగియడానికి ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని.. ముందే ఎలా ఆపుతారంటూ మండిపడ్డారు. తన వద్ద ఉన్న వాచీ ఇస్తానని.. సమయం చూసుకో అని అన్నారు. ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని.. తాను కచ్చితంగా మాట్లాడి తీరుతానని పేర్కొన్నారు. తనను ఆపే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు.
తాను చాంద్రయణగుట్ట ప్రజలకు కనుసైగ చేస్తే పోలీసులు పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అయినంత మాత్రాన తాను అలసిపోయానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తాను ఇప్పటికీ ధైర్యంగా, బలంగా ఉన్నానని చెప్పారు. దయచేసి రెచ్చగొట్టవద్దని కోరారు.