విషమంగానే తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్ధితి .. వెంటిలేటర్‌పై చికిత్స : ఏఐజీ హెల్త్ బులెటిన్
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంపై హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తమ్మినేని పరిస్ధితి విషమంగానే వుందని.. మందులతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంపై హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వెంటిలేటర్ సపోర్ట్‌తో తమ్మినేని ఏఐజీకి వచ్చారని , ఆయన గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్లు పేర్కొన్నారు. తమ్మినేని పరిస్ధితి విషమంగానే వుందని.. మందులతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో వీరభద్రానికి చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెప్పారు.
కాగా.. మంగళవారం ఖమ్మం పర్యటనలో వుండగా తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను తొలుత ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తమ్మినేనిని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. దీంతో సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. ఏఐజీలో చికిత్స పొందుతోన్న తమ్మినేని వీరభద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.