Asianet News TeluguAsianet News Telugu

అప్పుడేమో పాకిస్తాన్‌, ఇప్పుడేమో దేవుడు .. ఎన్నికల వేళ మోడీ మాయ చేస్తుంటారు .. జాగ్రత్త : ఖర్గే

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈడీ, సీబీఐ దాడులు పెరిగే అవకాశం వుందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.  ఒకసారి పాకిస్తాన్ బూచీ చూపిస్తారు, మరోసారి దేవుడిని వాడుకుంటారంటూ బీజేపీకి చురకలంటించారు. 

aicc president mallikarjun kharge slams pm narendra modi ksp
Author
First Published Jan 25, 2024, 5:31 PM IST

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈడీ, సీబీఐ దాడులు పెరిగే అవకాశం వుందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. పార్లమెంట్ ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ కార్యకర్తలే బలమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనం కృషి చేయాలని ఖర్గే పేర్కొన్నారు. మోడీ మాయమాటలు విని మోసపోవద్దని, రైతుల బాధలు, కష్టాలు ఆయనకు తెలియవని చురకలంటించారు. ప్రజలకు న్యాయం చేసేందుకే రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేస్తున్నారని ఖర్గే తెలిపారు. 

హామీలు ఇచ్చి తప్పించుకునే రోజులు పోయాయని.. సమరోత్సాహంతో కార్యకర్తలు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పనిచేయాలని మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఒకసారి పాకిస్తాన్ బూచీ చూపిస్తారు, మరోసారి దేవుడిని వాడుకుంటారంటూ బీజేపీకి చురకలంటించారు. దేశ యువత, రైతులు, మహిళలు, ఆదివాసీల కోసం రాహుల్ యాత్ర చేస్తున్నారని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. మోడీ హామీలపై వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నిస్తానని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ అమలు చేయలేదన్నారు. 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు అదే జోష్‌తో పనిచేసి పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ చీఫ్ కోరారు. మోడీ నేతృత్వంలో ధరలు పెరిగిపోయాయని, సమస్యలు ఎదురైనప్పుడు.. మోడీ ఏదో ఒక ఇష్యూతో డైవర్ట్ చేస్తుంటారని ఖర్గే ఎద్దేవా చేశారు. మోడీ , షా.. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసే కుటిల రాజకీయం చేస్తుంటారని, ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలు అమల్లోకి తెచ్చామన్నారు. సమస్యల నుంచి దృష్టి మళ్లించడంలో మోడీ దిట్ట అని .. ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసిగొలిపి, ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మోడీ గత పదేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని, స్వతంత్ర సంస్థలను సర్వ నాశనం చేశారని ఖర్గే దుయ్యబట్టారు. బీజేపీ బెదిరింపులకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భయపడరని.. బూతు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన కోరారు. మోడీ ఈ పదేళ్లలో 155 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. ఎన్నికల వేళ మోడీ మాయ చేస్తుంటారని.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఖర్గే  సూచించారు. కేసీఆర్ ఎప్పుడూ బీజేపీని నిలదీయలేదు, కాంగ్రెస్ పైనే ఎప్పుడూ విమర్శలు చేసేవారని దుయ్యబట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios