బీజేపీ ప్రభుత్వానికి మద్ధతిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాల్సిందేనన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లఖార్జున ఖర్గే. కేసీఆర్ బయట బీజేపీని తిడతారని.. లోపల మాత్రం మంతనాలు జరుపుతారని ఆయన దుయ్యబట్టారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం వచ్చిందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. శనివారం చేవేళ్లలో జరిగిన ప్రజా గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ.. కేసీఆర్‌ను గద్దె దించడానికే మీరంతా వచ్చారని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేస్తామని ఖర్గే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని.. లడఖ్‌లో బైక్ రైడ్ చేశారని ఆయన తెలిపారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం వుందన్నారు. ప్రజల అభీష్టం మేరకే తెలంగాణ ఏర్పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సేనని.. ఇచ్చిన హామీని నెరవేరుస్తామని మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చామని నెరవేరుస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తారని.. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ , ఇస్రో ఏర్పాటు చేసిందన్నారు.
తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారని.. కానీ తెలంగాణ ప్రజలందరి క్రెడిట్ అంతా ఒకే వ్యక్తి తీసుకున్నారని మల్లిఖార్జున ఖర్గే దుయ్యబట్టారు. ఇక్కడి ప్రజల మనసు తెలుసుకుని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కానీ తనవల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెబుతున్నారని ఖర్గే మండిపడ్డారు. సోనియాతో ఫోటో దిగి.. బయటకు వచ్చి మాట మార్చారని ఆయన ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు. దశాబ్ధాల పాటు పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు దేశానికి ఏం చేశాయని ఖర్గే ప్రశ్నించారు. నెహ్రూ, పటేల్ కలిసి చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేశారని ఆయన గుర్తుచేశారు. 53 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో దేశాన్ని బలోపేతం చేశామని.. హైదరాబాద్‌కి అనేక సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని ఖర్గే తెలిపారు.
దేశంలోని ప్రముఖ కంపెనీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని ఆహార భద్రత చట్టాన్ని మేమే తెచ్చామని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్ట్‌లను ఎవరు నిర్మించారని ఖర్గే ప్రశ్నించారు. తాము చేసిన పనుల వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందని.. భూ సంస్కరణలు అమలు చేసి ఫ్యూడల్ పద్ధతిని నిర్మూలించామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులను జాతీయీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఖర్గు గుర్తుచేశారు.
కేసీఆర్ బయట బీజేపీని తిడతారని.. లోపల మంతనాలు జరుపుతారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ ఉందంటే రాజీవ్ గాంధీయే కారణమని ఖర్గే చెప్పారు. హరితవిప్లవం, శ్వేత విప్లవం కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. నరేగా చట్టం తెచ్చింది ఎవరు.. కాంగ్రెస్సేనని మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం తెచ్చింది ఎవరు.. కాంగ్రెస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశం కావడం వల్లే తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని అయ్యానని ఖర్గే చెప్పారు.
రేపు అమిత్ షా ఖమ్మం వస్తున్నారని.. కాంగ్రెస్ ఏం చేసిందని అంటారని మండిపడ్డారు. మోడీ సర్కార్‌ను గద్దె దించేందుకు సెక్యులర్ శక్తులు ఏకమయ్యాయని చెప్పారు. కర్ణాటక సర్కార్‌ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. శిశు మరణాలు గుజరాత్‌లోనే ఎక్కువగా వున్నాయని ఆయన పేర్కొన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాల వల్లే మహిళా అక్షరాస్యత 65 శాతమైందని ఖర్గే చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టామని కాంగ్రెస్ తెచ్చిన అనేక సంస్థలను మోడీ ప్రభుత్వం విక్రయిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. దేశాన్ని ఐక్యంగా వుంచడమే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు.
