ఓ ప్రైవేటు కాలేజీ బస్సు కింద పడి ఇద్దరు అక్కా చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. వారి సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... కాలేజీ బస్సు వచ్చి ఢీ కొట్టింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా ఖాన్పూర్ ప్రాంతానికి చెందిన షాజియా(23), షాఫియా(21)లు తమ సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో బైక్ ని వారి సోదరుడు నడుపుతున్నాడు. కాగా... వెనక నుంచి వచ్చిన స్థానిక ప్రైవేట్ కాలేజీకి చెందిన బస్సు వచ్చి వారు బైక్ ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు కింద షాజియా, షాఫియాలు పడిపోయారు. కాగా.... వారి సోదరుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

కాగా... షాజియా అక్కడికక్కడే మృతి చెందగా... షాఫియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్థానిక డైట్ కాలేజీలో టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తున్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కాలేజీ బస్సు డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా అతి వేగంతో బస్సు నడిపాడని చెబుతున్నారు.

షాజియా, షాఫియా ల తండ్రి సుబాన్ మాట్లాడుతూ... తాను డైట్ కాలేజీలో అటెండర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. తన కూతుళ్లు ఇద్దరికీ డైట్ సెట్ లో మంచి ర్యాంక్ వచ్చిందని ఇలా అర్థాంతరంగా చనిపోతారని కలలో కూడా ఊహించలేదని వాపోయాడు. మరి కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా... ఆ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.