సిద్ధిపేట అదనపు కలెక్టర్ ను వీధికుక్క కరిచింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సిద్దిపేట : కుక్కకాటు ఘటనలు తెలంగాణను వదలడం లేదు. హైదరాబాదులో ఓ చిన్నారిని వీధి కుక్కలు కరిచి చంపిన ఘటన తర్వాత వరుసగా అనేక ఘటనలు అలాంటివి వెలుగులోకి వచ్చి.. భయాందోళనలు కలిగించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎక్కువగానే వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే చిన్నారులు.. ముసలివారు.. సామాన్యులే కాదు.. అధికారులు కూడా కుక్కకాటుకు బలవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి ఘటన ఒకటి సిద్దిపేట కలెక్టరేట్లో వెలుగు చూసింది.
తెలంగాణలోని సిద్దిపేట కలెక్టరేట్లో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కుక్క కాటుకు గురయ్యారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా కుక్కలు తీవ్రంగా కరిచాయి. కలెక్టర్ పెంపుడు కుక్కను కూడా వీధికుక్కలు కరిగి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట కలెక్టరేట్ నగర శివారులలో ఉంది. అక్కడ కలెక్టరేట్ తో పాటు అధికారుల నివాసాలు కూడా ఉన్నాయి.
ఆ నివాసాల్లోనే అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఉంటున్నారు. శనివారం రాత్రి ఆయన తాముంటున్న క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ వీధి కుక్క అతడిని గట్టిగా కరిచింది. దీంతో శ్రీనివాసరెడ్డి రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం తీవ్రంగా అయ్యింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే కుక్కని తరిమికొట్టి ఆయనని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ రెడ్డి ఐసియూలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.
హిందువులకు మాత్రమే ఆధార్ కార్డులివ్వాలి... ప్రత్యేక చట్టం తేవాలి... పరిపూర్ణానంద స్వామి పిలుపు
అదనపు కలెక్టర్ ను కుక్క కరిచిన అదే రోజు రాత్రి మరో వీధి కుక్క కలెక్టర్ పెంపుడు కుక్కను కూడా కరిచింది. దాంతోపాటు కలెక్టరేట్ సమీపంలోని ఒక పౌల్ట్రీ ఫార్మ్ వద్ద మరో బాలుడిని కూడా కుక్కలు కరిచాయి. ఈ ఘటనను వరుసగా వెంట వెంటనే జరగడంతో.. కలెక్టరేట్ సమీపంలో నివసిస్తున్న అధికారుల కుటుంబాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో.. అధికారులకే భద్రత లేకపోతే మా పరిస్థితి ఏంటి అని సామాన్య ప్రజలు వాపోతున్నారు.
ఇదిలా ఉండగా, కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు సమీపంలో శనివారం నవజాత శిశువు మృతదేహాన్ని కుక్క ఈడ్చుకెళ్లిన ఘటన షాకింగ్ గురి చేసింది. ఈ ఘటనలో కుక్కను తరిమికొట్టి చిన్నారిని వైద్యపరీక్షలు చేయగా అప్పటికే మృతి చెందినట్లు తేలింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నవజాత శిశువును నోట కరుచుకుని ఓ కుక్క ఆసుపత్రి ప్రసూతి వార్డు చుట్టూ పరిగెత్తడాన్ని సిబ్బంది, ఆస్పత్రికి వచ్చినవారు గమనించారు. వెంటనే వారు కుక్కకు తరిమికొట్టినట్లు మెక్‌గాన్ జిల్లా ఆసుపత్రిలోని సెక్యూరిటీ గార్డులు తెలిపారు. కుక్క నోట్లోని చిన్నారిని వైద్య పరీక్షలకు తీసుకువెళ్లేలోపే మృతి చెందింది. ఈ సంఘటన నగరంలో వీధికుక్కల బెడదకు అద్దం పడుతోంది.
కుక్క కరవడానికి ముందే నవజాత శిశువు చనిపోయాడా లేదా కుక్క నోట్లో పెట్టుకుని చక్కర్లు కొట్టడం వల్ల చనిపోయాడా అనే దానిపై అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రులెవరో ఇంకా తెలియరాలేదు. దీనిమీద పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోస్టుమార్టం తర్వాతే శిశువు మృతికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియనున్నాయని వర్గాలు చెబుతున్నాయి.
