డ్రగ్స్ కేసు.. పోలీసుల ఎదుట విచారణకు హాజరైన నవదీప్..
ప్రముఖ హీరో నవదీప్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు.

హైదరాబాద్: ప్రముఖ హీరో నవదీప్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా నార్కొటిక్ పోలీసులు ఇటీవల నవదీప్‌కు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే సైఫాబాద్‌లోని నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ కార్యాలయంలో నవదీప్ పోలీసులు విచారణకు హాజరయ్యారు. దీంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలపై నవదీప్‌ను ప్రశ్నించనున్నారు.
ఇక, సెప్టెంబరు 14న తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్ పౌరులను, టాలీవుడ్ డైరెక్టర్‌తో సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి కొకైన్, ఎక్స్‌టాసీ పిల్స్, ఎండీఎంఏ సహా పలు రకాల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డ్రగ్స్ వ్యాపారులతో నవదీప్ సంప్రదింపులు జరిపినట్టుగా తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితుల్లో ఒకరైన కొల్లి రాంచంద్ నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆరోపించిన పోలీసులు.. అందుకు తగ్గ ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నవదీప్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.
అయితే ఈ కేసుతో సంబంధం లేదని నవదీప్ వెల్లడించారు. ఈ క్రమంలోనే నవదీప్ హైకోర్టు నుంచి చట్టపరమైన రక్షణ పొందేందుకు ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. నవదీప్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే నవదీప్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి.. విచారణ చేపట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవదీప్ కూడా పోలీసుల ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.