డ్రైవర్ బాబు మరణానికి సంబంధించి కరీంనగర్‌లో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌తో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ కోర్టు సెంటర్ వద్ద బండి సంజయ్ కూడా బైఠాయించి నిరసన తెలియజేశారు.

ఆర్టీసీ కార్మికుడు బాబు అంతిమయాత్రపై కూడా పోలీసుల నిర్బంధం ఏంటని విపక్షనేతలు మండిపడ్డారు. ప్రభుత్వం అడుగడుగునా కార్మికులను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

బాబు అంతిమయాత్రకు పోలీసులు అనుమతించకపోవడమే ఉద్రిక్తతకు కారణం.. బాబు మృతదేహాన్ని దారి మళ్లించి వేరే చోటుకి తరలించారు. పెద్దఎత్తున ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబసభ్యులు తరలిరావడంతో ఆరేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

Also Read:ఇన్‌ఛార్జ్ ఎండీని కోర్టు ముందు దోషిగా నిలబెట్టాం..అది మా స్టామినా : అశ్వత్థామరెడ్డి

ఓ పోలీస్ అధికారి  కరీంనగర్  ఎంపీ బండి సంజయ్ పై  చేయి చేసుకోవడాన్ని  నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి  తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ దమన నీతికి, దుర్మార్గానికి పరాకాష్ఠ అన్నారు. వెంటనే  డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించి  కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీ లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు .

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  ఆ అధికారులను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిన్నటి వరకు బీజేపీ కార్యకర్తలు , నాయకుల మీద కక్ష సాధింపు చర్యలుగా తప్పుడు కేసులు బనాయించి  వేధించిన పోలీసులు ఏకంగా కేసీఆర్ మెప్పు కోసం, కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు.

Also Read:ఏం లెక్కలివి: ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు మొట్టికాయలు

నిజామాబాద్  లో  కవిత, కరీంనగర్ లో వినోద్ రావులు ఓడిన నాటి నుంచి  కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారశైలి ఇలాగే ఉందన్నారు. రాష్ట్రంలో కేసీర్ పాలన శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తించాలని  ఆయన హితవు పలికారు.

కేసీఆర్ రాక్షన పాలనకు చరమగీతం పలికే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని  అప్పటి వరకు బీజేపీ కార్యకర్తలకు  అండగతా నిలబడతామని గుర్తు చేశారు . దీని వెనక రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హస్తం ఉన్నదని, పోలీసుల చేత మహమూద్ అలీ ద్వారా కేసీఆర్ ఈ వ్యవహరం నడిపిస్తున్నట్టు స్పష్టంగా అర్దమవుతోందని అర్వింద్ వ్యాఖ్యానించారు. 

ఆర్టీసీ కార్మికుల సమస్యలను, తమ పోరాటాన్ని ప్రపంచానికి తెలియచేద్దామని తలపెట్టిన సభకు హాజరైన కరీంనగర్ కార్మికుడు నంగునూరి బాబు గుండెపోటుకు గురై మరణించాడు. 

Also Read:RTC Strike: ఆర్టీసీ డ్రైవర్ మృతి... కరీంనగర్ బంద్ పై పోలీసుల ఉక్కుపాదం

ఆర్టీసీ కార్మికుడి మృతికి సంతాపంగా జరుగుతున్న బంద్ కు స్థానిక బిజెపి నాయకులు మద్దతిచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన కార్యక్రమాలన్నింటిని వాయిదా వేసుకున్నారు.

ఇవాళ జరగాల్సిన గాంధీ సంకల్ప యాత్రను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. డ్రైవర్ మృతదేహానికి  ఎంపీ నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు.