బుధవారం మరో ఆర్టీసీ డ్రైవర్ అకాల మరణానికి  గురయ్యాడు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను, తమ పోరాటాన్ని ప్రపంచానికి తెలియచేద్దామని తలపెట్టిన సభకు హాజరైన కరీంనగర్ కార్మికుడు నంగునూరి బాబు గుండెపోటుకు గురై మరణించాడు. ఈ క్రమంలో డ్రైవర్ మృతికి సంతాపంగా ఇవాళ(గురువారం) జరుగుతున్న కరీంనగర్ బంద్ కు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో పాటు  ప్రజలు మద్దతిస్తున్నారు. 

ఆర్టీసీ కార్మికుడి మృతికి సంతాపంగా జరుగుతున్న బంద్ కు స్థానిక బిజెపి నాయకులు మద్దతిచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన కార్యక్రమాలన్నింటిని వాయిదా వేసుకున్నారు. ఇవాళ జరగాల్సిన గాంధీ సంకల్ప యాత్రను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. డ్రైవర్ మృతదేహానికి  ఎంపీ నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. 

read more  RTC Strike: 27వ రోజుకు ఆర్టీసీ సమ్మె, మరో డ్రైవర్ మృతి

ఇక ఈ సందర్భంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన వివిధ పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి,సిఐటియూ జిల్లా కార్యదర్శి బండారి శేఖర్, ఆర్టీసీ జేఏసీ నాయకులు టీఆర్ రెడ్డి, జక్కుల మల్లేశం, శ్రీనివాస్ తదితర నాయకులు, కార్మికులు ఉదయం 6 గంటలకే బస్ స్టాండ్ వద్ద  నిరసనకు సిద్దమయ్యారు. దీంతో అక్కడే వున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ ట్రెయినింగ్ సెంటర్ కు తరలించారు.

ఈ బంద్ సందర్భంగా కరీంనగర్ బస్టాండ్ లో బస్సులను అడ్డుకుంటున్న సిపిఐ నేతలు కూడా ప్రయత్నించారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  విద్యాసంస్థల  బంద్ కు ప్రయత్నించిన ఎస్‌ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు కూడా అరెస్టయ్యారు.

గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి బాబు భౌతిక కాయానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే అతడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.     

read more  RTC strike video : కరీంనగర్ లో ఆర్టీసీ బంద్ కి మద్దతు తెలిపిన మంత్రి బండి సంజయ్

సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన కరీంనగర్ డిపోకు చెందిన డ్రైవర్ బాబు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. సభలో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు డ్రైవర్ బాబు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బాబు ప్రాణాలు కోల్పోయారు.  

డ్రైవర్ బాబు మరణంపై ఆర్టీసీ జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. డ్రైవర్ బాబు మరణంపై బోరున విలపించారు. సంతాపం తెలిపారు. గురువారం కరీనంగర్ బంద్ కు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు. 

ఇకపోతే బాబు గత 25 రోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నాడు. సమ్మెలో కీలక పాత్ర పోషిస్తున్న బాబు బుధవారం హైదరాబాద్ లో  జరిగిన సకల జనుల సమరభేరి సభకు హాజరై ప్రాణాలు కోల్పోయాడు. 

ఇకపోతే ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కార్యచరణ ప్రకటించారు. గురువారం ఒక్కరోజు దీక్షకు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్ తరహా ఉద్యమానికి సిద్ధం కావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమానికి ప్రభుత్వం దిగిరాకపోతే త్వరలోనే ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చ్ కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.