నిర్మల్: తెలంగాణలోని నిర్మల్ మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన సాయన్న హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ఉపేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

చిట్యాల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ భార్యతో మృతుడు సాయన్నకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై గ్రామంలో పలుమార్లు పంచాయతీ కూడా పెట్టారు. అదే సమయంలో శ్రీనివాస్ తరుచుగా అనారోగ్యం బారిన పడుతూ వచ్చాడు. దాంతో సాయన్న తనపై మంత్రాలు ప్రయోగిస్తున్నాడని శ్రీనివాస్ అనుమనించాడు. 

దాంతో సాయన్నను చంపడానికి పథకం వేశాడు. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి సాయన్నను హత్య చేసేందుకు ఇంటి శ్రీనివాస్ కాపు కాశాడు. ఆ రోజు రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన సాయన్న మెడపై, తలపై శ్రీనివాస్ దాడి చేశాడు. దాంతో సాయన్న అక్కడికక్కడే మరణించాడు. 

ఆ తర్వాత శవాన్ని ఇంటి సమీపంలో పాతిపెట్టేందుకు గోయి కూడా తవ్వాడు. అది వీలు కాకపోవడంతో మృతదేహాన్ని అక్కడే ఉంచి శ్రీనివాస్ తన ఇంటికి వెళ్లాడు. రక్తం మరకలు ఉన్న చొక్కాను వదిలేసి పారిపోయాడు. మర్నాడు శుక్రవారం ఉదయం సాయన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

దాంతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీనివాస్ ను శనివారం దిలావర్ పూర్ గ్రామ సమీపంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత  నిందితుడు హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నాడు.