హైదరాబాద్:  కీసర తహాసీల్దార్  నాగరాజు కేసులో ఏసీబీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.  ఈ కేసులో నగదు లావాదేవీలు ఎక్కడి నుండి జరిగాయనే కోణంలో విచారణ జరిపేందుకు వీలుగా ఐటీ శాఖకు ఏసీబీ లేఖ రాసింది.

కొన్ని రోజుల క్రితం రూ.1.10 కోట్లు లంచం తీసుకొంటూ కీసర  తహాసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం నాగరాజుతో పాటు ఆయనకు సహకరించిన వారు రిమాండులో ఉన్నారు.  
 
రిమాండులో ఉన్న నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు ఈ నెల 19వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజుతో పాటు శ్రీనాథ్, అంజిరెడ్డిలను విచారిస్తే కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

నాగరాజు ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. గతంలో నాగరాజు పనిచేసిన చోట రికార్డులను కూడ ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే కేసులో అరెస్టైన అంజిరెడ్డి, శ్రీనాాథ్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను కూడ ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. 

నాగరాజుకు ఏయే ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి, వాటి విలువ ఎంత అనే విషయమై కూడ ఏసీబీ అధికారులు లోతుగా పరిశీలన చేస్తున్నారు. విదేశాల్లో కూడ నాగరాజుకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో కూడ ఏసీబీ దర్యాప్తు చేయాలని భావిస్తోంది.నాగరాజుకు సంబంధించిన లావాదేవీల విషయమై ఐటీ శాఖకు ఏసీబీ లేఖ రాసింది.