మర్రిగూడ ఎమ్మార్వో ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా నోట్ల కట్టలు, కిలోల కొద్ది బంగారం..
నల్గొండ జిల్లా మర్రిగూడ ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మహేందర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో.. ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపై దాడులు జరిపారు.

నల్గొండ జిల్లా మర్రిగూడ ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మహేందర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో.. ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపై దాడులు జరిపారు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ఇంట్లో భారీగా నగదును అధికారులు గుర్తించారు. కట్టల కొద్ది నోట్లను చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఒక ట్రంకుపెట్టెలోనే రూ. 2 కోట్లకు పైగా నగదు దొరికినట్టుగా సమాచారం.
అంతేకాకుండా మహేందర్ ఇంట్లో భారీగా బంగారం కూడా లభ్యమైంది. నగదుతో పాటు కిలోల కొద్ది బంగారాన్ని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మహేందర్ రెడ్డి పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి ఏసీబీ అధికారులు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మహేందర్ రెడ్డికి సంబంధించిన ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.