లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ నిర్మల.
పెద్దపల్లి : ప్రభుత్వం అందించే జీతాలు సరిపోక సామాన్యులను లంచాల కోసం వేధిస్తున్న అధికారుల పని పడుతోంది అవినీతి నిరోధక శాఖ(ఏసిబి). ఇలా అనేకమంది లంచగొండి అధికారులు ఏసిబికి చిక్కగా తాజాగా పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. డాక్యుమెంట్స్ ఇవ్వడానికి సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.
పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి డాక్యుమెంట్స్ కోసం వెళ్లిన పూదరి శ్రీనివాస్ కు అధికారులు లంచం డిమాండ్ చేసారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ దేవనగరి నిర్మలకు లంచంగా భారీ డబ్బులు చెల్లించాడు. కానీ తన డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడమే కాదు మరికొన్ని డబ్బులు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేసారు. ఇలా మాటిమాటికీ లంచం అడుగుతూ తన పని చేయకపోవడంతో విసిగిపోయిన శ్రీనివాస్ ఏసిబిని ఆశ్రయించాడు.
శ్రీనివాస్ ఫిర్యాదుతో ఎసిబి డిఎస్పి భద్ర తన టీమ్ తో రంగంలోకి దిగారు. బాధితుడి నుండి రూ.60వేలు లంచం తీసుకుంటుండగా రిజిస్ట్రార్ నిర్మల, అటెండర్ శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి వద్దనుండి బాధితుడు లంచంగా ఇచ్చిన డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.
వీడియో
ఇదిలావుంటే ఇటీవల లంచం తీసుకుని కూడా పెన్షన్ మంజూరుచేయడం లేదంటూ ఓ వృద్దుడు అధికారులను నిలదీసిన ఘటన ఇదే పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దపేట గ్రామానికి చెందిన పల్నాటి మల్లారెడ్డికి వృద్దాప్య పెన్షన్ రావడం లేదు. దీంతో అతడు పంచాయితీ కార్యదర్శిని సంప్రదించగా రూ.1500 ఇస్తే పెన్షన్ మంజూరయ్యేలా చేస్తానని చెప్పాడట. దీంతో చేసేదేమిలేక అడిగినన్ని డబ్బులు ఇచ్చానని... అయినా పెన్షన్ మంజూరు చేయలేదని వృద్దుడు ఆందోళన వ్యక్తం చేసాడు.
పంచాయితీ కార్యదర్శి తీరుతో విసిగిపోయిన వృద్దుడు ఎంపిడీవో కార్యాలయానికి చేరుకుని పెన్షన్ కోసం నిలదీసాడు. పెద్దపేట కార్యదర్శిని పట్టుకుని లంచం తీసుకుని కూడా పెన్షన్ ఎందుకివ్వడం లేదంటూ వృద్దుడు నిలదీసాడు. దీంతో ఎంపిపి సంపత్ వృద్దుడికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి... కార్యదర్శి పై విచారణ జరిపించాలని ఎంపీడీవోను ఆదేశించారు.
