హైదరాబాద్: బంజారాహిల్స్‌లో 1.20 ఎకరం భూమి విషయంలో  లంచం తీసుకొంటూ పట్టుబడిన కేసులో షేక్‌పేట  ఆర్ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్ ఎస్ఐ రవీందర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

బంజారాహిల్స్‌లో సయ్యద్ అబ్దుల్‌కు చెందిన స్థలాన్ని ప్రభుత్వం రెవెన్యూ స్థలంగా పేర్కొంది. స్థలం తమదేనంటూ సయ్యద్ అబ్దుల్ కోర్టుకెక్కారు. స్థలం సయ్యద్ అబ్దుల్‌దేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. 

లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ బోర్డు తీసి సయ్యద్ అబ్దుల్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు సయ్యద్ అబ్దుల్‌పై కేసు నమోదైంది. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్‌ఐ నాగార్జున, బంజారాహిల్స్‌ ఎస్సై రవీందర్‌ 50 లక్షలు డిమాండ్ చేశారు.

also read:రూ. 15 లక్షలు తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన షేక్‌పేట ఆర్ఐ

రూ. 50 లక్షల్లో మొదటి విడతగా శనివారం నాడు రూ. 15 లక్షలను అబ్దుల్ రెవిన్యూ ఇన్స్ పెక్టర్ నాగార్జున రెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. ఇదే విషయంలో బంజారాహిల్స్ ఎస్ఐ రవీందర్ కూడ లక్షన్నర రూపాయాలను తీసుకొన్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్ఐ రవీందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరో వైపు  షేక్‌పేట ఎమ్మార్వో ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 30 లక్షల నగదు, బంగారం, కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు.

రెవిన్యూ ఉన్నతాధికారుల పాత్ర కూడ ఏమైనా ఉందా అనే కోణంలో కూడ ఏసీబీ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.