హైదరాబాద్: విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ  ఏబీవీపీ  బుధవారం నాడు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీకి దిగారు. అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై  దాడికి దిగారు పోలీసులు.

విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  ఏబీవీపీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అసెంబ్లీ గేట్ -3 కు తాళం వేశారు పోలీసులు. కానీ విద్యార్థులు గేటు ఎక్కారు. కొందరు గేటు మీది నుండి  శాసనమండలి వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు అసెంబ్లీ  వద్ద ఆందోళనకు దిగిన సమయంలో అసెంబ్లీ ఉభయ సభలు సమావేశమయ్యాయి. 


ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో అసెంబ్లీ వద్దకు చేరుకొన్న ఏబీవీపీ సంఘం నేతలు అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. మరోవైపు  ఇవాళే పీడీఎస్‌యూ కూడ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.