తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే నేతల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే నేతల నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి గడువు శుక్రవారంతో ముగియగా.. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 1025 మంది కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈసారి కొందరు సీనియర్లు పక్కకు తప్పుకుని.. వారి వారసులను రంగంలోకి దించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పోటీ నుంచి తప్పుకుని ఇద్దరి కుమారులను బరిలోకి దింపారు. జానా రెడ్డి పెద్ద కుమారుడు రఘువీరారెడ్డి మిర్యాలగూడ నుంచి, చిన్న కుమారుడు జైవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ టిక్కెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. జానారెడ్డి లాగానే పలువురు సీనియర్లు బరి నుంచి తప్పుకుని వారసులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. జనార్దన్ రెడ్డి, కొండా సురేఖ వంటివారు తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. 119 నియోజకవర్గాల్లో ఒక్క కొడంగల్‌లో మాత్రమే ఒక్క దరఖాస్తు వచ్చింది. అక్కడి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేశారు. కొండగల్ నియోజకవర్గం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఒకటికి మించి దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఇల్లందు (ఎస్టీ రిజర్వుడు) నియోజకవర్గానికి 38 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి.
ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. భట్టి విక్రమార్క(మధిర), సీతక్క (ములుగు), పొదెం వీరయ్య (భద్రాచలం), శ్రీధర్‌బాబు (మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి) ఉన్న చోట్ల కూడా పోటీ నెలకొంది. ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే సీనియర్ నేతలు వి హనుమంతరావు, నాగం జనార్దన్ రెడ్డి, రేణుకా చౌదరి, కొండా మురళి దరఖాస్తులు సమర్పించలేదని తెలుస్తోంది.
ఇక, కొందరు నేతలతో పాటు వారి వారసులు కూడా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్‌నగర్ స్థానానికి, ఉత్తమ్ సతీమని పద్మావతి.. కోదాడఅసెంబ్లీ నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. సీనియర్ నేత దామోదర రాజానరసింహ, ఆయన కుమార్తె త్రిష.. ఆందోల్ నియోజకవర్గానికి దరఖాస్తులు సమర్పించారు. సీతక్క ములుగు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. పినపాకకు ఆమె కుమారుడు సూర్యం దరఖాస్తు చేసుకున్నారు. కేసీఆర్ సోదరుడి కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు రమ్యరావు, ఆమె కుమారుడు రితేష్‌లు కరీంనగర్ అసెంబ్లీ టిక్కెట్ కోసం దరఖాస్తులు సమర్పించారు.
అంజన్‌కుమార్ యాదవ్, ఆయన కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ ఇద్దరూ ముషీరాబాద్ నియోజకవర్గం టికెట్ కోసం దరఖాస్తు సమర్పించారు. ఇక, అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ దరఖాస్తు సమర్పించారు.
అయితే ఈ దరఖాస్తులకు సంబంధించిన స్క్రూట్నీ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం కానుంది. ఈ భేటీలో దరఖాస్తుదారుల అర్హతపై చర్చించనున్నారు. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి.. పార్టీ అధిష్టానానికి పంపనున్నారు. అధిష్టానం ఆమోదం తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇందుకు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
