Asianet News TeluguAsianet News Telugu

కొవాగ్జిన్ టీకాలు ఎక్స్‌పైర్ అవుతున్నాయ్.. 2023లో కాలం చెల్లిపోతున్న డోసులు ఐదు కోట్లు!

భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాలు పెద్ద మొత్తంలో డిమాండ్ లేకుండా కంపెనీ వద్దే మూలుగుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా 20 కోట్ల బల్క్ డోసులు కంపెనీ వద్ద ఉన్నట్టు తెలిసింది. అందులో ఐదు కోట్ల డోసులు వయల్స్ రూపంలో వినియోగానికి సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ వర్గాలు వివరించాయి.
 

about 50 million doses of covaxin set to expire in the next year 2023
Author
First Published Nov 6, 2022, 1:00 PM IST

న్యూఢిల్లీ: కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టీకాల కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూసింది. సెకండ్ వేవ్‌ కాలంలో టీకాల కోసం బారులు తీరారు. ముందే టీకాలను బుక్ చేసుకుని రోజుల తరబడి ఎదురుచూసి మరీ టీకా కేంద్రాలకు వెళ్లి కరోనా వ్యాక్సిన్లు వేసుకున్నారు. చాలా సార్లు ఏ టీకా అందుబాటులో ఉంటే అదే టీకా వేసుకున్నారు. మన దేశంలో తొలిగా పూణెలోని సీరం తయారు చేసిన కొవిషీల్డ్, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాలే అందుబాటులోకి వచ్చాయి. అవే అప్పుడు జీవధారలుగా వెలుగొందాయి. కానీ, థర్డ్ వేవ్ తర్వాత.. అప్పుడు ఉన్నంత ఆందోళన ఇప్పుడు కనిపించడం లేదు. టీకాలు సెకండ్ డోసు వేసుకోలేనివాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకొందరు బూస్టర్ డోసు కూడా వేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు ఇంకా మారిపోయాయి. టీకాల డిమాండ్ అనూహ్యంగా పడిపోయింది. ఎంతగానంటే తయారు చేసిన టీకా డోసులు కూడా ఎక్స్‌పైర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి.

భారత్ బయోటెక్ దగ్గర ఇప్పుడు సుమారు ఐదు కోట్ల డోసులు వయల్స్‌లో సేల్స్‌కు రెడీగా ఉన్నాయి. కానీ, డిమాండ్ లేని కారణంగా కంపెనీ వద్దే ఉండిపోతున్నాయి. ఇవి వచ్చే ఏడాది తొలినాళ్లలో ఎక్స్‌పైర్ కాబోతున్నాయి. ఈ మేరకు ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

కరోనా టీకాలకు డిమాండ్ పడిపోవడంతో కొవాగ్జిన్ టీకా ఉత్పత్తులను ఈ ఏడాది తొలినాళ్లలోనే ఆపేశారు. వాస్తవానికి గతేడాది చివరి కల్లా టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక బిలియన్ డోసులకు పెంచుకుంది. కానీ, డిమాండ్ పడిపోవడంతో మొత్తంగా ఉత్పత్తినే నిలిపేసింది.

Also Read: Bharat Biotech | పిల్ల‌ల్లో కొవాగ్జిన్ ప‌నితీరు భేష్.. లాన్సెట్ జర్నల్ వెల్ల‌డి

భారత్ బయోటెక్ దగ్గర బల్క్‌ ఫామ్‌లో 20 కోట్ల డోసులు ఉన్నాయని కంపెనీ వర్గాలు వివరించాయి. ఇందులో సుమారు ఐదు కోట్ల డోసులు వయల్స్‌లో వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపాయి. కానీ, డిమాండ్ లేకపోవడం కారణంగా కొన్ని నెలల క్రితమే టీకా ఉత్పత్తిని నిలిపేసినట్టు వివరించాయి. వయల్స్‌లో సిద్ధంగా ఉన్న సుమారు ఐదు కోట్ల టీకాలు వచ్చే ఏడాది తొలినాళ్లలో కాలం చెల్లిపోతున్నట్టు తెలిపాయి.

అయితే, ఇవి ఒక వేళ కాలం చెల్లిపోతే.. కంపెనీకి వాటిల్లనున్న నష్టం మొత్తం ఎంత అనేది తెలియరాలేదు. 

మన దేశంలో శనివారం నాడు కొత్తగా 1,082 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, యాక్టివ్ కేసులు 15,200గా ఉన్నాయి. ఇప్పటి వరకు మన దేశంలో కొవాగ్జిన్ సహా అన్ని టీకాలు కలిపి 219.71 కోట్ల డోసులు పంపిణీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios