తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలువడిన  కొద్దిసేపటికే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. నిజమాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన ప్రజ్వల్ హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈరోజు ఇంటర్ ఫలితాలు వెలువడిన కాసేపటికే ప్రజ్వల్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలో ఫెయిల్ అయ్యాననే బాధతో ప్రజ్వల్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజ్వల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫ‌స్టియ‌ర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైందని తెలిపారు. బాలికలు బాలిక‌లు 68.68 శాతం, బాలురు 54.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించారని చెప్పారు. ఇంటర్ ఫ‌స్టియ‌ర్ 4,33,082 మంది హాజ‌రైతే 2,72,208 మంది ఉత్తీర్ణ‌త సాధించారని.. ఉత్తీర్ణత శాతం 62.85గా న‌మోదైందని తెలిపారు. సెకండియ‌ర్‌లో 3,80,920 మంది హాజ‌రైతే 2,56,241 మంది ఉత్తీర్ణ‌త సాధించ‌గా.. ఉత్తీర్ణత శాతం 67.27గా న‌మోదైందని చెప్పారు. 

జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఫలితాలపై రీకౌంటింగ్, రీ వాల్యూయేషన్‌కు మే 10 నుంచి మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు. ఎంసెట్‌లో ఇంట‌ర్ వెయిటేజీని తీసేశామని.. పిల్ల‌లు ఎవ‌రూ కూడా ఒత్తిడికి గురి కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)