పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడానికి వచ్చి.... కానిస్టేబుల్ పైనే ఓ వ్యక్తి దాడి చేశాడు. ఫిర్యాదు చేయాలని చెప్పి...కానిస్టేబుల్ వేలు, తొడ కొరికేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ చిటికెన వేలు తెగిపడిపోయింది. ఈ సంఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఖమ్మం నాయిబ్రాహ్మణ కాలనీకి చెందిన డుంగ్రోతు మస్తాన్, మరో ఇద్దరు వ్యక్తులు సోమవారం అర్థరాత్రి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తాము ఓ వ్యక్తిపై ఫిర్యాదు  చేయడానికి వచ్చామని  చెప్పారు. దీంతో... వివరాలు చెప్పలిందిగా వాళ్లని కానిస్టేబుల్ మన్సూరలీ కోరాడు. వివరాలు చెప్పే క్రమంలో మస్తాన్ బీభత్సం సృష్టించాడు.

కానిస్టేబుల్ పై దాడి చేశాడు. అతని చిటికెన వేలు కొరికేశాడు. ఆ వెలు తెగ కింద పడిపోయింది. అనంతరం కానిస్టేబుల్ తొడని కూడా కొరికేశాడు. అనంతరం మస్తాన్, అతనితోపాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు.

కాగా... కానిస్టేబుల్ పై దాడి చేస్తున్న క్రమంలోనే మస్తాన్ ని ఏఎస్సై నాగేశ్వరరావు పట్టుకుని విచారించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఏఎస్సై పై కూడా దాడి చేయడం గమనార్హం. స్టేషన్ ఆవరణలో అద్దాలను ధ్వంసం చేశాడు. అతను కొన్నేళ్లుగా ఇలానే వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్లను, రహదారులపై ఘర్షణలకు దిగేవాడని పోలీసులు తెలిపారు.

గతంలో రైలు పట్టాలపై తానే స్వయంగా కాళ్లు పెట్టడంతో రెండు కాళ్లు తెగిపోయాయి. పలు స్టేషన్ లపై దాడులు చేసిన ఘటనలో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. కాగా.. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.