తెలంగాణలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం కొత్తగా 983 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటితో కలిపి రాష్ట్రంలో కోవిడ్ 19 కేసుల సంఖ్య 14,419కి చేరింది.

ఆదివారం కరోనాతో నలుగురు మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 247కి చేరుకుంది. రాష్ట్రంలో 9 వేల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 5,172 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Also Read:జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా విస్తృతి: మళ్లీ లాక్ డౌన్ యోచనలో కేసీఆర్

ఇవాళ హైదరాబాద్‌లో 816 మందికి వైరస్ సోకగా.. రంగారెడ్డి 47, మేడ్చల్‌ 29, మంచిర్యాల 33, వరంగల్ రూరల్ 19, వరంగల్ అర్బన్ 12, భద్రాద్రి 5, నల్గొండ 3, కరీంనగర్ 3, నిజామాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్, జనగామలో ఒక్కో కేసు నమోదైంది. మంచిర్యాల జిల్లాలో ఒక వ్యక్తి ద్వారా 30 మందికి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 

జీహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. 

జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయనచెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

Also Read:వెంటిలేటర్ పెట్టాలని వేడుకొన్నాడు: చనిపోయే ముందు యువకుడి సెల్పీ వీడియో

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.