సికింద్రాబాద్ సింధీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ నేరానికి పాల్పడిన 9 మందితో కూడిన నేపాల్ గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ సింధీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ నేరానికి పాల్పడిన 9 మందితో కూడిన నేపాల్ గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 5 కోట్ల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంటికి సెక్యూరిటీ గార్డుగా ఉన్న నేపాల్‌కు చెందిన కమల్.. తన సన్నిహితులతో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడు. పక్కా ప్లాన్‌గా ఈ దోపిడీ చేశారు.
అసలేం జరిగిందంటే.. సికింద్రాబాద్ సింధీ కాలనీలో రాహుల్ గోయల్ అనే వ్యాపారి నివాసముంటారు. రాహుల్ గోయల్ నేపాల్‌కు చెందిన కమల్ అనే వ్యక్తిని వాచ్‌మెన్‌గా నియమించుకున్నాడు. కమల్ తన కుటుంబంతో కలిసి రాహుల్ బంగ్లాలోని సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉండేవాడు. అయితే ఈ నెల 9వ తేదీ ఉదయం 11.30 గంటలకు రాహుల్ ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్స్‌కు వెళ్లారు. ఈ నెల 10వ తేదీన తిరిగి వచ్చారు. అయితే రాహుల్ తిరిగివచ్చేసరికి.. మెయిన్ డోర్ లాక్ పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా అల్మారా తాళాలు కూడా పగలగొట్టి ఉన్నాయి. అందులో బంగారు ఆభరణాలు, నగలు కనిపించకుండా పోయాయి. మరోవైపు వాచ్‌మెన్ కమల్, అతని కుటుంబ సభ్యులు తమ ఇంట్లో లేరని రాహుల్ గుర్తించారు.
ఇందుకు సంబంధించి రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 49 లక్షల నగదు, 4 కిలోల బంగారం, 10 కిలోల వెండి చోరీకి గురైందని పేర్కొంది. వాచ్‌మెన్ కమల్, అతని కుటుంబంపై అనుమానం వ్యక్తం చేశారు. కమల్, అతని కుటుంబ సభ్యులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ముంబైలో కమల్ కుటుంబంలోని కొంతమంది సభ్యులను పోలీసులు పట్టుకోగలిగారు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి మొత్తంగా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
