9 మంది ఇంటర్‌స్టేట్ చీటర్స్ గ్యాంగ్ అరెస్ట్, రూ. 45 లక్షలు స్వాధీనం

9 members held for cheating in Hyderabad
Highlights

ఇంటర్‌స్టేట్ చీటర్స్ గ్యాంగ్ ను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పలువురిని మోసం చేసి రూ.3 కోట్ల వరకు వసూలు చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్టు హైద్రాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు. 

హైదరాబాద్:ఇంటర్ స్టేట్ చీటింగ్ గ్యాంగ్ సభ్యులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  రుణాలతో పాటు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని  హైద్రాబాద్ సీపీ అంజన్ ‌కుమార్ తెలిపారు.

శుక్రవారం నాడు  హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ గ్యాంగ్ సభ్యులు  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  పలువురిని మోసం చేశారని అంజన్‌కుమార్ ప్రకటించారు. అమాయకులను  నమ్మించి సుమారు రూ.3 కోట్లను వసూలు చేశారని  ఆయన తెలిపారు.

ఈ ముఠాకు చెందిన తొమ్మిది మంది సభ్యులను అరెస్ట్ చేసినట్టు  సీపీ తెలిపారు. ఈ ముఠాలోని సతీసన్, రాంనివాస్, హరి నివాస్‌లపై హైద్రాబాద్, చెన్నైలలోని 9 పోలీస్ స్టేషన్లలో  కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

ఈ ముఠా సభ్యుల నుండి సుమారు రూ.45 లక్షలను స్వాధీనం చేసుకొన్నట్టు ఆయన తెలిపారు. నమ్మించి మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగాగా ఉండాలని సీపీ అంజన్ కుమార్ ప్రజలను కోరారు.
 

loader