హైదరాబాద్: కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడటానికి ప్రయత్నించివారే ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 84మంది పోలీస్ అధికారులకు కరోనా సోకింది. ఇలా పోలీస్ శాఖలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారు విధులకు హాజరు కావద్దని...  ఇంటివద్దే విశ్రాంతి తీసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డి ప్రకటించారు.

కరోనా పోరాటంలో ప్రంట్ లైన్ వారియర్స్  గా పోలీసులు ఎంతో సాహసోపేతంగా  విధులు నిర్వహించారు. యావత్ దేశం కరోనాకు భయపడి ఇళ్లకే పరిమితమైనా పోలీసులు మాత్రం తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్లపైనే  విధులు నిర్వహించారు. ఇలా ప్రజలను కరోనా నుండి  కాపాడే ప్రయత్నంలో కొందరు పోలీసులే దాని బారిన పడ్డారు.

read more   కరోనా రహిత జిల్లాల్లోనూ మళ్లీ కలకలం... తెలంగాణలో 191 కొత్త కేసులు

పోలీసులు, వైద్యులతో పాటు కరోనా విజృంభణ సమయంలోనూ విధులు నిర్వహించారు జర్నలిస్ట్ లు. ఈ మహమ్మారికి సంబంధించిన వార్తలను సేకరించడానికి క్లిష్టమైన సమయాల్లోనూ వీరు విధులు నిర్వహించారు. దీంతో ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 16మంది జర్నలిస్ట్ లకు కరోనా సోకింది. వారు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఇటీవల కరోనా సోకి యువ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. అతడి మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని... అతడికి మైరుగైన వైద్యం  అందించడంలో గాంధీ వైద్యులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం  విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్‌ బారిన పడిన జర్నలిస్టులకు ఇకపై ప్రత్యేక వార్డులో చికిత్సలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గాంధీ ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో జర్నలిస్ట్‌ మనోజ్‌ పేరుతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.