హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 191 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. అయితే ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధితో పాటు చుట్టుపక్కల ఒకటి రెండు జిల్లాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు మారుమూల జిల్లాలకు కూడా పాకింది. ఇప్పటికే కరోనా రహిత జిల్లాలుగా మారిన జిల్లాల్లోనూ తాజాగా కేసులు బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 

ప్రస్తుతం బయటపడ్డ కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4111కి చేరింది. ఇందులో 3663 లోకల్ కేసులు వుండగా 448 వలస కూలీలు, ఇతర దేశాల నుండి వచ్చినవారు వున్నారు. 

ఇవాళ ఒక్క జీహెచ్ఎంసీ లోనే 143 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. జిల్లాల వారిగా చూసుకుంటే మేడ్చల్ లో 11, సంగారెడ్డి జిల్లాలో మరో 11 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 8, మహబూబ్ నగర్ 4, జగిత్యాల 3, మెదక్ 3, నాగర్ కర్నూల్ 2, కరీంనగర్ 2, నిజామాబాద్ 1, వికారాబాద్ 1, నల్గొండ 1, సిద్దిపేట 1 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 191 కేసులు ఈ ఒక్కరోజే బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. 

ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1817మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 2138 మంది మాత్రం ఇంకా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వుండాలని, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం సూచించింది. అనవసరంగా ఇళ్లల్లోంచి బయటకు రావద్దని... ఏదైనా పనులపై వచ్చిన మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం చేయాలని సూచించింది.