కరోనా వ్యాక్సినేషన్ లో అక్కడక్కడా అపశ్రుతులు చోటు చేసుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో వ్యాక్సిన్ వేయించుకున్న ఎనిమింది మంది కరోనా బారిన పడడం కాస్త భయాందోళనలకు గురి చేస్తోంది. 

మంచిర్యాల జిల్లాలో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్న రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రి సిబ్బందిలో ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది. వీరికి లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఆరుగురికి కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తుండగా, మరో ఇద్దరు మాత్రం హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 

కాగా రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో  కరోనా టీకా వేసుకున్న ఓ వాలంటీర్ మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. అయితే ఈమె మరణానికి కరోనా వ్యాక్సిన్ కారణమై వుండదని... ఇతర అనారోగ్య సమస్యలే కారణమై వుంటాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత ఈ వాలంటీర్ మరణానికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు. 

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పలాస మండలం రెంటికోటకు చెందిన వాలంటీర్ పిల్లా లలిత(28)తో పాటు మరో 8మంది వాలంటీర్లు, వీఆర్వో ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఈ టీకా తీసుకున్నప్పటి నుండి వీరంతా తీవ్ర అస్వస్ధతతో బాధపడుతున్నారు.  స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. 

అయినప్పటికి వీరంతా ఆస్పత్రికి వెళ్లకుండా ఇళ్లవద్దే వుంటున్నారు. ఈ క్రమంలోనే లలిత ఆరోగ్యం మరింతగా దెబ్బతింది. ఇలా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన లలిత మృతిచెందింది. 
 
దీంతో అప్రమత్తమైన అధికారులు లలితతో పాటు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. వ్యాక్సిన్‌ వికటించడం వల్లే లలిత మృతి చెందిందని కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. దీంతో పలాస తహసీల్దార్‌ మధుసూదనరావు, కాశీబుగ్గ సీఐ శంకరరావు, డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌ తదితరులు లలిత మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మృతికి గల కారణాలను నిర్ధారించగలమని అదికారులు తెలిపారు.