హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ ప్రధాన కార్యాలయాన్ని గ్రూప్ 2 అభ్యర్ధులు ముట్టడించిన ఘటనలో 78 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే  కోచింగ్ సెంటర్ యజమాని అశోక్‌ను రిమాండ్‌కు తరలించారు. 

హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ ప్రధాన కార్యాలయాన్ని గ్రూప్ 2 అభ్యర్ధులు ముట్టడించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే 78 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోచింగ్ సెంటర్ యజమాని అశోక్‌ను రిమాండ్‌కు తరలించారు. గ్రూప్ 2 విద్యార్ధులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని అశోక్‌పై అభియోగాలు నమోదు చేశారు. తప్పుడు మెసేజ్‌లతో ఆందోళనకు గురిచేశారని ఆరోపించారు. 

కాగా.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థుల ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని పోలీసు శాఖ అనుమానిస్తుంది. ఈ విషయమై కోచింగ్ సెంటర్లపై కేసులు నమోదు చేయనున్నారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని గురువారంనాడు అభ్యర్థులు ఆందోళనలు నిర్వహించారు. గంట మాత్రమే ఆందోళనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ నాలుగు గంటలకు పైగా ఆందోళన నిర్వహించారు అభ్యర్థులు. పరీక్ష వాయిదా వేసే విషయమై రెండు రోజుల తర్వాత వెబ్ నోటిఫికేషన్ ఇస్తామని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ఆందోళనకారుల ప్రతినిధి బృందానికి చెప్పారు.

ALso Read: గ్రూప్-2 పరీక్షల వాయిదాకై టీఎస్‌పీఎస్‌సీ వద్ద ఆందోళన: కోచింగ్ సెంటర్ల పాత్రపై అనుమానాలు

అయితే ఈ విషయమై ఇవాళే స్పష్టత ఇవ్వాలని ఆందోళనకారులు కోరుతున్నారు. ఈ ఆందోళన సమయంలో కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను పోలీసులు గుర్తించారని సమాచారం. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల ప్రమేయం ఉందని ఇంటలిజెన్స్ సమాచారం పోలీసులకు అందింది.