కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల్లో చిక్కుకున్న 65 మంది అంతర్రాష్ట్ర కార్మికుల బృందాన్ని అధికారులు కాపాడారు.
కరీంనగర్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతూ, నిండుకుండలా మారిన చెరువుల కట్టలు తెగి జనావాసాలను ముంచెత్తుతున్నాయి. ఇలా ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికుల గుడిసెలను వరదనీరు చుట్టుమట్టిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వెంటనే అధికారులు స్పందించి దాదాపు 65మందితో కూడిన అంతర్రాష్ట్ర కూలీల బృందాన్ని సురక్షితంగా కాపాడారు.
విద్యుత్ టవర్ పనులు చేపడుతున్న అంతర్రాష్ట్ర కార్మికులు జమ్మికుంట మండలం వావిలాల గ్రామ సమీపంలో నివాసముంటున్నారు. ఓ చెక్ డ్యాం సమీపంలో గుడిసెలు వేసుకుని కార్మికులు నివాసముంటున్నారు. అయితే ఇటీవల కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న అత్యంత భారీ వర్షాలతో చెక్ డ్యాం నిండిపోయి వరదనీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ వరద నీటిలో కార్మికులు చిక్కుకున్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వరదనీటిని దాటి నిత్యావసర వస్తువులు కూడా తీసుకునే పరిస్థితి లేకపోవడంతో 65 మంది కార్మికులు ఆకలితో అలమటించారు. చుట్టూ నీరే వున్న కనీసం గుక్కెడు మంచినీరు కూడా అందుబాటులో లేకుండా పోయాయి.
వీడియో
మానేరు గేట్లు తెరిస్తే పెను ప్రమాదం చోటుచేసుకునేది. కానీ కార్మికుల పరిస్థితి గురించి తెలుసుకున్న అధికారులు స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం ఎక్కువగా వుండటంతో తాళ్ల సాయంతో కార్మికులందరినీ బయటకు తీసుకువచ్చారు. అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తమను కాపాడిన వావిలాల గ్రామస్తులు, అధికారులకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
Read More భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం : రెండో ప్రమాద హెచ్చరిక జారీ, సాయంత్రానికి ఉధృతి మరింత పెరిగే ఛాన్స్
ఇదిలావుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లితో పాటు నిర్మల్ జిల్లాలోని మరో గ్రామాన్ని కూడా వరదనీరు ముంచెత్తిన విషయం తెలిసిందే. నిర్మల్ జిల్లా బైంసా మండలం సిరాల గ్రామ శివారులోని చెరువులో వరదనీటి ఉదృతి పెరగడంతో చెరువుకట్ట తెగిపోయింది. దీంతో వరదనీరంతా గ్రామాన్ని ముంచెత్తింది. వరదనీరు చుట్టుముట్టడంతో ప్రజలంతా ప్రాణభయంతో ఓ కొండపైకి పరుగుతీసారు. అంతకంతకు వరదనీరు పెరుగుతుండటంతో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.దాదాపు 200 మంది ఎత్తైన ప్రాంతంలో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. వర్షంలో తడిసి ముద్దవుతూ దిక్కుతోచని స్థితిలో గుట్టపైనే వున్నారు.
గ్రామస్తుల నుండి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గుట్టపైకి చేరుకుని గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు. వరదనీరు అంతకంతకు పెరుగుతూ సహాయక చర్యలకు కూడా ఆటంకం కలిగిస్తోంది. అయినప్పటికీ గ్రామస్తులను కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
