బిట్ కాయిన్ పేరు చెప్పి.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 1200మందిని నిట్ట నిలువునా ముంచేశారు. ప్రత్యేకంగా ఓ దందా ఏర్పాటు చేసుకొని అమాయలను మోసం చేసి రూ.10కోట్లు నిక్కేశారు. కొంతమంది బాధితుల ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు వారు కటకటాల పాలయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామానికి చెందిన గర్దాస్‌ రమేశ్‌ (46) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో నివాసముంటున్నాడు. తన పేరిట జీఆర్‌ఎం ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఓ కార్యాలయాన్ని స్థాపించి నకిలీ కాయిన్‌ఎక్స్‌ ట్రేడింగ్‌ (క్రిప్టో కరెన్సీ/బిట్‌కాయిన్‌) ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నాడు. కరీంనగర్‌ జిల్లాలోని చింతకుంట గ్రామానికి చెందిన సుదగోని సత్తయ్య (53), నర్సింహుల పల్లి గ్రామ నివాసి నామాల వెంకటేశ్‌ (33), ఒంగోలు జిల్లా పెద్దపాలెం గ్రామ నివాసి కుంచాల హరిగోపాల్‌ (31), సికింద్రాబాద్‌ నివాసి చందుపట్ల శ్రీనివాస్‌ (45)లు ఈ వ్యాపారంలో సబ్‌ బ్రోకర్లుగా పని చేస్తున్నారు. ఈ ఐదుగురు ఓ గ్యాంగ్‌గా తయారై బిట్‌కాయిన్‌ పేరిట భారీ మోసానికి తెరలేపారు.
 
ప్రధాన నిందితుడైన గర్దాస్‌ రమేశ్‌ 25ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి బోయిన్‌పల్లిలో స్థిరపడ్డాడు. సునాయాసంగా డబ్బు సంపాదించడానికి మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని ఆ దిశలో పావులు కదిపాడు. ముంబైలోని సిబి ఆన్‌లైన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కంపెనీని సంప్రదించాడు. అక్కడి మేనేజర్లు మోహన్‌, సునీల్‌ చౌహాన్‌లకు తన ప్లాన్‌ వివరించి కాయిన్‌ఎక్స్‌ ట్రేడింగ్‌ డాట్‌ కామ్‌ పేరిట ఓ వెబ్‌సైట్‌ను రూపొందించాలని కోరాడు. కస్టమర్లు నకిలీదని కాకుండా... అసలు కంపెనీలా కనిపించడంతోపాటు త్వరగా ఆకర్షితులయ్యే విధంగా ఓస్కీమ్‌ను కూడా రూపొందించాలని కోరాడు.

నిందితుడు చెప్పిన విధంగా వెబ్‌ డిజైనర్లు కాయిన్‌ఎక్స్‌ ట్రేడింగ్‌ డాట్‌ కామ్‌ పేరిట ఓ వెబ్‌సైట్‌ను రూపొందించి దాని కార్యాలయాన్ని న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఉన్నట్లు వివరాలు నమోదు చేశారు. గూగుల్‌లో శోధించినా అక్కడి చిరునామా ప్రత్యక్షమయ్యే విధంగా సూచించారు. అంతేకాకుండా కంపెనీ కార్యకలాపాలు అమెరికా, లండన్‌లతో పాటు వివిధ దేశాల్లో కొనసాగుతున్నట్లు కూడా ప్రచారం కల్పించారు. దానికోసం ప్రత్యేకంగా బిట్‌కాయిన్‌ యాడ్‌ను పూర్తిగా వాడుకుని చివరన తమ స్కీము వివరాలు... ఆఫీసు వివరాలు రాసి కస్టమర్లను బోల్తా కొట్టించారు. దానికోసం వెబ్‌ డిజైనర్లకు ఫీజు కింద రూ. లక్ష చెల్లించాడు. బోయిన్‌పల్లిలోని తన కార్యాలయం నుంచి 2017 మార్చి నుంచి రమేశ్‌ నలుగురు సబ్‌బ్రోకర్లను నియమించుకుని తన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాడు.
 
ఆకర్షణీయమైన స్కీములతో ప్రచారం కల్పించడంతో సుమారు 1200మంది సభ్యులుగా చేరి పెట్టుబడులు పెట్టారు. కస్టమర్ల నుంచి నేరుగా.. ఆన్‌లైన్‌, బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు తీసుకుని, వాటిని డాలర్లుగా మార్చి పెట్టుబడి పెడతామని నమ్మిస్తూ దందా సాగించారు. ఎక్కడా ఎవరికీ అనుమానాలు రాకపోవడంతో అక్రమ దందా క్రమంగా పెరుగుతూ పోయింది.

తీరా తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ నకిలీ బిట్ కాయిన్ దందా బయటపడింది. పలు చోట్ల సోదాలు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.