ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసుల దగ్గర హల్ చల్ చేశాడు. నా కారే పట్టుకుంటావా అంటూ రెచ్చిపోయాడు.. అతనికి మరికొంతమంది తోడై.. తాము ఎమ్మెల్యే అనుచరులమంటూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన హైదరాబాద్ లో మంగళవారం అర్థరాత్రి జరిగింది.
హైదరాబాద్ : ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు కొందరు మంగళవారం అర్ధరాత్రి బంజారాహిల్స్లో హంగామా సృష్టించారు. బంజారా హిల్స్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల వివరాల ప్రకారం.. బంజర హిల్స్ రోడ్ నెంబర్ 2లోని పార్క్ హయత్ హోటల్ ముందు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటల ప్రాంతంలో కారు( టిఎస్ 07 జీఎస్ 111 3)ను నిలిపి వాహనం నడుపుతున్న వ్యక్తికి శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా రక్తంలో మద్యం మోతాదు 151 బీఏసీగా వచ్చింది.
అతడిని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన వ్యాపారి కిరణ్ కుమార్ రెడ్డి(34)గా గుర్తించారు. అతని బంధువులు కేశంపేట వాసి యెన్నం శ్రీధర్ రెడ్డి (47), మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన హనుమంత్ రెడ్డి (33), సైదాబాద్ కు చెందిన వై శ్రీకాంత్ రెడ్డి (44), బోడుప్పల్ కు చెందిన డ్రైవర్ వి నరేందర్ రెడ్డి (31) అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము మేడ్చల్ ఎమ్మెల్యే అనుచరులం అంటూ.. కారు ఇచ్చేయాలంటూ పోలీసులను నెట్టేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్పించారు. సస్పెండ్ చేయిస్తానంటూ బెదిరించారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ఉపేందర్ ఫిర్యాదు మేరకు కిరణ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా, Two wheeler మీద వెళుతున్న దంపతులను బైక్ మీద వెంబడించి Woman మెడలోని గొలుసు తెంచుకుని విమానంలో పారిపోవడానికి ప్రయత్నించిన దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. గొలుసు లాక్కునే క్రమంలో మహిళ వాహనంపై పడి గాయాలపాలైనా అతను కటువుగా వ్యవహరించాడు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై అబ్దుల్లాపూర్మెట్ సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెంది తూపల్లి నరసింహ రెడ్డి కుటుంబం నగరంలోని హస్తినాపురం అనుపమ నగర్ కాలనీలో ఉంటున్నారు.
4 రోజుల క్రితం నరసింహారెడ్డి (65), భార్య కమల (55)తో కలిసి బ్రాహ్మణపల్లి వెళ్లారు. మంగళవారం సాయంత్రం బైక్పై తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద హైవే పై ఓ దుండగుడు బైక్ మీద వెనకనుంచి వచ్చి కమల మెడలోని పుస్తెలతాడు తెంచేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. కొంత దూరం వెళ్ళిన నిందితుడు తిరిగి వచ్చి కమల మెడలోని నాలుగున్నర తులాల పుస్తెలతాడు తెంచుకొని నగరం వైపు పరారయ్యాడు. నరసింహారెడ్డి దొంగను కొంతదూరం వెంబడించినా ఫలితం లేకపోయింది. గాయపడిన కమలను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
బాధితుడి ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు వేగంగా స్పందించి హైవేపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. లభించిన సాంకేతిక ఆధారాలతో.. నిందితుడు ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ చన్వర్ గేట్లో నివసించే హేమంత్ గుప్తా (24)గా గుర్తించారు. గాజుల దుకాణంలో పనిచేసే అతను తాను ఎంచుకున్న ప్రాంతానికి విమాన టికెట్లు బుక్ చేసుకుని గొలుసుల చోరీలు చేసి వెళ్తుంటాడు. ఇలా ఆరుసార్లు తప్పించుకున్నాడు. ఏడోసారి తప్పించుకుని విమానంలో పారిపోతుండగా, బుధవారం అబ్దుల్లాపూర్మెట్, విమానాశ్రయ, ఎల్బీనగర్ సిసిఎస్ పోలీసులు కలిసి సంయుక్తంగా పట్టుకున్నారు. పుస్తెలతాడుతో పాటు బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
