బంధువు అంత్యక్రియల కోసం వెళుతూ రోడ్డు ప్రమాదం బారినపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
భువనగిరి: అంత్యక్రియల కోసం వెళుతూ భార్యభర్తలతో పాటు మరోమహిళ రోడ్డుప్రమదానికి గురయి దారుణం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ముగ్గురి మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే... యాదాద్రి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం గ్రామానికి చెందిన దండెబోయిన నర్సింహ, రాజ్యలక్ష్మి భార్యాభర్తలు. బొమ్మలరామారం మండలం చౌదరిపల్లిలో వీరి బంధువు చనిపోవడంతో భార్యతో పాటు వదిన జంగమ్మను తీసుకుని నర్సింహ బైక్ పై బయలుదేరాడు.
ఇలా అంత్యక్రియల కోసం వెళుతున్న వీరిని మృత్యువు వెంటాడింది. భువనగిరి పట్టణ సమీపంలోని హనుమపూర్ బచ్పన్ స్కూల్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ ను అతివేగంతో వచ్చిన డిసిఎం ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నర్సింహతో పాటు వెనకాల కూర్చున్న ఇద్దరు మహిళలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రోడ్డుపై రక్తపుమడుగులో పడిపోయారు. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. రోడ్డుపై పడివున్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదానికి డిసిఎం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అనుమానిస్తున్నారు. అతివేగంతో భారీవాహనం ఒక్కసారిగి మీదకు దూసుకురావడంతో బైక్ నడుపుతున్న నర్సింహతో తప్పించుకునే అవకాశం చిక్కలేదని... దీంతో ముగ్గురు మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిసిఎం డ్రైవర్ పరారీలో వున్నాడు.
పక్కరాష్ట్రం ఏపీలో కూడా ఇలాగే వివాహానికి వెళుతూ రోడ్డుప్రమాదానికి గురయి ఇద్దరు మృతిచెందారు. కృష్ఱా జిల్లా బాపులపాడు మండలం అంబాపురం వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు విజయనగరం నుండి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
