యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బీబీనగర్‌ మండలం గూడూరు వద్ద రెండు కార్లు, ఒక వాటర్‌ ట్యాంకర్‌ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా..  నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు చెందిన ఏడుగురు స్నేహితులు వెంకటేశ్‌, హర్షవర్ధన్ నాయక్‌, అఖిల్‌ రెడ్డి, కల్యాన్‌ రెడ్డి, కార్తిక్‌, రవి కిరణ్‌, సాయి చరణ్‌ ఆలేరులోని మరో స్నేహితుడు సాయికుమార్‌ సోదరి వివాహానికి వెళ్లారు.  

వివాహం జరిగిన అనంతరం సాయంత్రం 5 గంటలకు కారులో ఆలేరు నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. గూడూరు వద్దకు చేరుకోగానే.. జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర రహదారిపై మొక్కలకు నీరు పోస్తున్న వాటర్‌ ట్యాంకర్‌ను వీరు ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న అఖిల్‌ రెడ్డి, హర్షవర్ధన్ నాయక్, సాయి చరణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంకటేశ్‌, కల్యాణ్‌ రెడ్డి, కార్తిక్‌ రెడ్డి, రవి కిరణ్‌ కారులోనే ఇరుక్కుపోయారు.

ఎంత ప్రయత్నించినప్పటికీ అందులో నుంచి బయటకు రాలేక సాయం కోసం కేకలు వేశారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని ఎంతో శ్రమించి బయటకు తీశారు. అయితే అప్పటికే తీవ్రగాయాల పాలవ్వడంతో నలుగురు మృతి చెందారు. 

అయితే అదే దారిలో వచ్చిన మరో కారు యువకులు ప్రయాణించిన కారును ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో వీరు స్పల్ప గాయాలతో బయటపడ్డారు. టోల్‌ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది.