అకాల వర్షం: తెలంగాణలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం
తెలంగాణలో అకాల వర్షానికి పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున పంటు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ నివేదిక తెలుపుతుంది.
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షానికి 4.5 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు నష్టపోయినట్టుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది.మంగళవారంనాడు రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రాష్ట్రంలోని 27 జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. మంగళవారంనాడు రాత్రి ఏడున్నర గంటల నుండి రెండున్నర గంటల పాటు భారీ వర్షం కురిసింది. మరో వైపు బుధవారంనాడు తెల్లవారుజాము వరకు కూడా కొన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతినడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
బుధవారంనాడు ఉదయం నుండి వ్యవసాయ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తేల్చారు. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ ప్రాథమిక అంచనా తెలుపుతుంది. వరి, మామిడి, మొక్కజొన్న, కూరగాయలు పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ నివేదిక తేల్చింది. ఆయా జిల్లాల్లో పంట నష్టంపై ప్రజా ప్రతినిధులు, మంత్రులు కూడా ఆరా తీస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రజాప్రతినిధులు ఓదార్చారు. మరో వైపు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
also read:తెలంగాణ రైతును నట్టేట ముంచిన అకాల వర్షం: పంట నష్టంపై అధికారుల సర్వే
ఉమ్మడి మెదక్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీగా పంట నష్టమైందని వ్యవసాయ శాఖ నివేదిక తేల్చింది.మరో వైపు ఇవాళ, రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాాఖ వార్నింగ్ ఇచ్చింది. దీంతో రైతులు అప్రమత్తమౌతున్నారు.