Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రైతును నట్టేట ముంచిన అకాల వర్షం: పంట నష్టంపై అధికారుల సర్వే

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  భారీ వర్షానికి  పెద్ద ఎత్తున  పంట నష్టం వాటిల్లింది.  ఆయా జిల్లాల వారీగా  పంట నష్టం అంచనాలను  అధికారులు  చేపట్టారు.  
 

Heavy rain, hailstorm damage crops across fields in Telangana lns
Author
First Published Apr 26, 2023, 9:51 AM IST

హైదరాబాద్:  రాష్ట్రంలో మంగళవారంనాడు రాత్రి  కురిసిన భారీ వర్షాల వల్ల   రాష్ట్రంలోని  27 జిల్లాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి.  చేతికొచ్చిన పంటలు   దెబ్బతినడంతో  రైతులు ఆవేదన చెందుతున్నారు.   కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం కూడా వర్షానికి తడిసి ముద్దయింది.  మరో వైపు  వ్యవసాయ క్షేత్రాల్లోని పంటలు కూడా  భారీ వర్షానికి  దెబ్బతిన్నాయి. 

మంగళవారం నాడు రాత్రి రాష్ట్రంలోని  పలు  జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.  రాత్రి  ఏడున్నరకు ప్రారంభమైన వర్షం  ఏకధాటిగా  రెండుగంటలు  కురిసింది.  ఆ తర్వాత  కొంత తెరిపినిచ్చింది. కానీ   బుధవారం నాడు తెల్లవారుజామున కూడా  వర్షం కురిసింది.ఈదురుగాలులు,  భారీ వర్షం కారణంగా  పంట నష్టపోయి రైతులు  కన్నీరు పెడుతున్నారు. 

ఉమ్మడి నిజామాబాద్   జిల్లాలో  వరి, నువ్వు, సజ్జ వంటి పంటలు  పూర్తిగా దెబ్బతిన్నాయి.  సుమారు   4,471 ఎకరాల్లో  పంట నష్టం జరిగిందని  అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.  మరో వైపు జిల్లాలోని  20 కొనుగోలు కేంద్రాల్లో  ధాన్యం తడిసింది.  

వనపర్తి జిల్లాలోని  గోపాల్ పేట, పెద్దమందడి,వనపర్తి, ఖిల్లాఘనపురం  మండలాల్లో భారీ వర్షం కురిసింది.  దీంతో  పంటలు దెబ్బతిన్నాయి.  నాగర్ కర్నూల్  మార్కెట్ లో  విక్రయించేందుకు తెచ్చిన   మొక్కజొన్న  తడిసింది. మరో వైపు  ఇదే జిల్లాలోని తాడూరు మండలం సిరసనవాడలో పిడుగుపాటుకు గేదే మృతి చెందింది.  

నిర్మల్  జిల్లాలోని థానూర్ మండలలో ఈదురుగాలులు, వడగళ్ల వానతో   దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తంగళ్లపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్  , ఎల్లారెడ్డిపేట  మండలాల్లో మామిడికాయలు నేలరాలాయి.  

ఉమ్మడి వరంగల్  జిల్లాల్లో పంట నష్టంపై  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు   అధికారుల నుండి సమాచారం తెప్పించుకుంటున్నారు. మరో వైపు  ఉమ్మడి మెదక్ జిల్లాలోని   పలు మండలాల్లో  పంటు దెబ్బతిన్నాయి.  దెబ్బతిన్న పంట పొలాలను  మంత్రి హరీష్ రావు బుధవారంనాడు పరామర్శించారు.  పంట నష్టపోయిన  రైతులను ఆదుకొంటామని  మంత్రి హరీష్ రావు  హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలపై సర్వే నిర్వహించాలని  ప్రభుత్వం ఆదేశించింది.  క్షేత్రస్థాయిలో పంట నష్టంపై  అధికారులు  సర్వే ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios