హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని మూడేళ్ల బాలిక దుర్మరణం పాలైంది. డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలికను టిప్పర్ లారీ ఢీకొట్టింది.

చక్రాల కింద పడి ఆ పసి ప్రాణం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దేహాశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. పాప మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కొద్దిరోజుల క్రితం నిజామాబాద్‌లో ఓ వ్యక్తి నిర్లక్ష్యంతో నెలల చిన్నారి కారు చక్రాల కింద నలిగిపోయింది. కారు ముందున్న చిన్నారిని చూసుకోకుండా దానిని ముందుకు పోనివ్వడంతో పసిబిడ్డ ప్రాణాలు విడిచింది.

నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలోని శివం అపార్ట్ మెంట్‌లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తన కుటుంబంతో కలిసి అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోనే నివాసిస్తున్నాడు. అక్కడే అపార్ట్‌మెంట్‌ వాసుల బైకులు, కార్లు పార్క్‌ చేస్తున్నారు.

రోజులాగానే 18 నెలల చిన్నారి మనస్వి తమ ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. అయితే ఆదివారం దురదృష్టవశాత్తూ పార్క్‌ చేసి ఉన్న కార్ల వద్దకు వెళ్లింది. ఈ సమయంలోనే ఓ వ్యక్తి పాపను చూసుకోకుండా తన కారును స్టార్ట్‌‌ చేసుకుని ముందుకు వెళ్లాడు.

చక్రాల కింద నలిగిపోయిన మనస్వి విగతజీవిగా మారింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం, కుటుంబ సభ్యులు పాపను గమనించకపోవడంతో ఘోరం జరిగిపోయింది. అప్పటి వరకు తమ ముందే ఆడుకుంటున్న చిన్నారి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారిస్తున్నారు.