కరెంట్ తగిలి షాక్ కొట్టడం కాదు, కరెంట్ బిల్లు చూసి ఓ కుటుంబం షాక్ కు గురైన సంఘటన బోడుప్పల్ లో చోటుచేసుకుంది. నివాస గృహానికి ఏకంగా రూ. 3.81 లక్షల బిల్లు వస్తే షాక్ కు గురవకుండా ఏం చేస్తారు. కానీ అధికారుల తప్పిదం వల్ల ఇంత భారీ మొత్తంలో బిల్లు వచ్చిందని తెలిసి వీరు ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్ బోడుప్పల్ స్వరూప అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసముంటోంది. అయితే ఈమె ఉంటున్న ఇంటికి ఈ నెల కరెంట్ బిల్లు రూ. 3.81 లక్షలు వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఈమె ఈ బిల్లు రశీదును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో విద్యత్ శాక అధికారుల తీరు పట్ల నెటిజన్లు విమర్శల వర్షం కురింపించారు. 

నెటిజన్ల నుండే కాకుండా ఉన్నతాధికారుల నుండి విమర్శలు రావడంతో అధికారులు స్పందించి తప్పును సరిదిద్దుకున్నారు. సదరు ఇంటికి మరోసారి వెళ్లి మీటర్ రీడింగ్ చూడగా కేవలం 63 యూనిట్ల విద్యుత్ వాడినట్లు ఉంది. దీనికి రూ. 134 చెల్లించాలని కొత్త బిల్లును జారీ చేయడంతో సమస్య పరిష్కారమైంది.

అయితే వివరాలను మెషీన్ లో నమోదు చేస్తున్నపుడు పొరపాటు జరగడంతో ఇంత బిల్లు వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారని విద్యుత్ శాక అధికారులు వివరించారు.