తెలంగాణలో కరోనా కేసులు 50 వేలు దాటాయి. గురువారం కొత్తగా 1,567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50,826కి చేరింది.

ఇవాళ వైరస్‌తో 9 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 447కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 39,327 మంది డిశ్చార్జ్ అయ్యారు.

హైదరాబాద్‌లో ఇవాళ ఒక్కరోజు 662 కేసులు నమోదవ్వగా.. రంగారెడ్డి 213, మేడ్చల్ 33, వరంగల్ అర్బన్ 75, సిరిసిల్ల 62, మహబూబ్‌నగర్ 61, నల్గొండ 44, సూర్యాపేట 39, కరీంనగర్ 38, నిజామాబాద్ 38, సంగారెడ్డి 32, భూపాలపల్లి 25, వరంగల్ రూరల్ 22, జనగాం 22, మహబూబాబాద్ 18, ఆదిలాబాద్ 17, ములుగు 17, జగిత్యాల 14, సిద్ధిపేట 9, వికారాబాద్ 5, ఆసిఫాబాద్ 4, పెద్దపల్లి, భద్రాద్రి, గద్వాలలో రెండేసి కేసులు, మంచిర్యాల, నిర్మల్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 

Also Read:కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైంది, జర భద్రం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

తెలంగాణలో కరోనా కమ్యూనిటీలోకి వెళ్లిందని తెలంగాణ హైల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రీణి నగరాల్లో కూడ కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు.

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వచ్చే నాలుగైదు వారాలు చాలా క్లిష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

యాక్టివ్ గా ఉన్న వాళ్లకు కరోనా టెస్టులు అవసరం లేదన్నారు. లక్షణాలు ఉంటేనే టెస్టులు చేసుకోవాలని ఆయన సూచించారు. కరోనా లక్షణాలు త్వరగా వస్తే అతి తక్కువ ఖర్చుతోనే చికిత్స చేయవచ్చని ఆయన చెప్పారు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉందని చెప్పారు. ప్రజలంతా కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆయన సూచించారు.ప్రస్తుతం వర్షా కాలం ప్రారంభమైంది. దీంతో సీజనల్ వ్యాధులు కూడ వచ్చే అవకాశం ఉందని ఆయన గుర్తు చేశారు. నాలుగైదు వారాలు చాలా క్లిష్టమైనవని ఆయన అభిప్రాయపడ్డారు.