తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో 14 ఆవులు మృతిచెందాయి. మరో ఆరు ఆవులు గాయపడ్డాయి.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో 14 ఆవులు మృతిచెందాయి. మరో ఆరు ఆవులు గాయపడ్డాయి. ఈ ఘటన అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై బుగ్గబావిగూడెం గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాలు.. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం తెల్లవారుజామున బుగ్గబావిగూడెం గ్రామ సమీపంలో రోడ్డు దాటుతున్న పశువుల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 ఆవులు చనిపోగా, ఆరు ఆవులు గాయపడ్డాయి.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసిందని పశువుల యజమాని ఆరోపించారు. ఆవులను ఢీకొన్న బస్సు అతివేగంతో వెళ్లిందని చెప్పాడు. తనను కాపాడుకునేందుకు పక్కకు వెళ్లానని తెలిపాడు. ఒక్కొక్క ఆవు ధర రూ. 40 వేల వరకు ఉంటుందని.. తనకు రూ. 7 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు ఎటవంటి గాయాలు కాలేదని సమాచారం.
ప్రమాదానికి సంబంధిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. పశువుల యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాధానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
