హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల బీభత్సం సృష్టించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు పడి ఆదివారంనాడు 13 మంది మృత్యువాత పడ్డారు.

తెలంగాణలో ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది మంది పిడుగుల బారిన పడ్డారు. తెలంగాణలోని భీమారం మండలం అరేపల్లి గ్రామంలో పిడుగులు పడి ముగ్గురు చనిపోయారు. కోసిన పంటపై టార్పలిన్ కప్పడానికి వెళ్లిన ఆ ముగ్గురిపై శనివారం రాత్రి పిడుగులు పడ్డాయి.

గాలివాన, ఉరుములూ మెరుపులతో కూడిన వాన వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఆదివారంనాడు ఎనిమిది మంది మరణించారు. శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు పడి ఏప్రిల్, మే నెలల్లో 20 మంది మరణించారు. 

ఈ నెలలో ప్రతి రోజూ ఉరుములూ మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు అంటున్నారు.