తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురికి వైరస్ సోకుతోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు మున్సిపల్ కమీషనర్ తెలిపారు.

ఆర్టీసీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజులుగా గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే ఆయనది ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో వారందరికీ కూడా జ్వరం వచ్చింది.

Also Read:నిజామాబాద్ కలెక్టరేట్ లో కరోనా కలకలం: డీఆర్వో అటెండర్ మృతి

ఈ నేపథ్యంతో కోవిడ్ సోకిందన్న అనుమానంతో శనివారం మదీనాగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుంబంలోని మొత్తం 14 మంది కోవిడ్ నిర్థారణా పరీక్షలు చేయించుకున్నారు.

ఈ క్రమంలో వీరిలో 12 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో కమీషనర్ సుజాత సిబ్బందితో ఆర్టీసీ కాలనీకి వెళ్లి పరిశీలించారు. స్థానికులంతా అప్రమత్తంగా ఉండాలని ధైర్యం చెప్పి ఆ ప్రాంతమంతా శానిటైజేషన్ చేయించారు.